శివకార్తికేయన్ ప్లేస్‌కు విజయ్‌సేతుపతి
తమిళసినిమా: ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుల్లో శివకార్తికేయన్, విజయ్‌సేతుపతిని పేర్కొనవచ్చు. శివకార్తికేయన్ రజనీమురుగన్, రెమో వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల తరువాత నటిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్. ఇందులో ఆయనతో తొలిసారిగా నటి నయనతార నటిస్తున్నారు. ఫాహద్‌ఫాజాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. రెమో చిత్రం తరువాత 24ఏఎం స్టూడియోస్ పతాకంపై ఆర్‌డీ.రాజా నిర్మిస్తున్న చిత్రం వేలైక్కారన్. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే సెప్టెంబరు 29వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
కాగా ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాక పోవడంతో చిత్ర విడుదలను డిసెంబరు నెలాఖరుకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మరో సక్సెస్‌ఫుల్ నటుడు విజయ్‌సేతుపతి, విక్రమ్‌వేదా, పురియాదపుధీర్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల తరువాత తాజాగా నటిస్తున్న చిత్రం కరుప్పన్. ఇందులో నటి తాన్యా నాయకిగా నటిస్తోంది. బాబీసింహా విలన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి పన్నీర్‌సెల్వం దర్శకుడు. శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం శివకార్తికేయన్ చిత్రం వేలైక్కారన్ విడుదల కావలసిన సెప్టెంబరు 29వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.