
సాక్షి, హైదరాబాద్ : అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆమె మరణంతో సూపర్‌స్టార్ కృష్ణ, నరేష్ శోకసంద్రంలో మునిగిపోయారు. రేపు ఉదయం 9 గంటలకు విజయ నిర్మల అంతిమయాత్ర చేపట్టనున్నారు. పదకొండు గంటలకు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయ నిర్మల అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నట్లు నరేష్ తెలిపారు.
1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించిన విజయ నిర్మల.. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేయగా.. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు.