విజయ్ దేవరకొండ
‘‘మొన్ననే ‘గీత గోవిందం’ సినిమా ప్రమోషన్స్.. ఇప్పుడు ‘నోటా’ ప్రమోషన్స్. ఇటు తెలుగు అటు తమిళ్ ప్రమోషన్స్‌తో చాలా అలసిపోయాను. శుక్రవారంతో ఈ ప్రమోషన్స్‌కి స్వస్తి చెబుతా. సినిమాలు చేయాలనుకున్నాను. కానీ మరీ నిద్ర లేని రాత్రులు గడిపేంత బిజీ అవ్వాలనుకోలేదు. అయినా ఇది చాలా మంచి అనుభూతినిస్తోంది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన హీరోగా, మెహరీన్ కథానాయికగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నోటా’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు...
► రాజకీయాలంటే ఇష్టం లేని ఒక సాధారణ వ్యక్తిని తీసుకెళ్లి ఎన్నికల్లో పోటీ చేయాలని దింపుతారు. అప్పుడు రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ‘నోటా’ కథ. రియలిస్టిక్‌గా ఉంటుంది. వాస్తవానికి దగ్గరగా ఉండే నటనంటే నాకూ ఇష్టమే. ఇందులో కొన్ని సొసైటీలో జరిగిన సంఘటనలున్నాయి. ‘నోటా’ని ఎంకరేజ్ చేయాలన్నది మా సినిమా ఉద్దేశం కాదు. టైటిల్‌కి యాప్ట్‌గా ఉంటుందని పెట్టాం.
► ‘నోటా’ కథ విన్నప్పుడు తమిళ రాజకీయాల గురించి తెలియదు. కథ వినగానే కనెక్ట్ అయ్యా. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయని మా సినిమా చూశాక ప్రేక్షకులు తెలుసుకుంటారు. ఈ సినిమా తెలంగాణలోని ఓ పార్టీకి సపోర్ట్‌గా ఉంటుందని చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. వివాదం చేసేకొద్దీ మా చిత్రానికి కలెక్షన్లు ఇంకా పెరుగుతాయి (నవ్వుతూ). అయినా వివాదాల్లోకి నన్ను ఎందుకు లాగుతున్నారో తెలియడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్.
► నటుడిగా బిజీ కాకపోతే రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళదామని గతంలోనే బ్యాకప్ ఆప్షన్ పెట్టుకున్నా. జనరల్‌గా సినిమా రిలీజయ్యాక పైరసీ చేయడం కామన్. అయితే ‘గీత గోవిందం’ 2.30 గంటలు లీక్ అయింది. ప్రేక్షక్షులు థియేటర్‌కి రారేమో? అనుకున్నా. ‘ట్యాక్సీవాలా’ కూడా లీక్ అయింది. ఈ రెండు సినిమాల కోసం ఏడాదిన్నర్ర పనిచేశా. ఇలా లీక్ చేస్తే సినిమా చేసి ఏం లాభం? అనిపించింది.
► తమిళ్‌లో మంచి సినిమాలు చేస్తున్నారని మనవాళ్లు అంటున్నారు. కానీ, తెలుగులో ‘అర్జున్‌రెడ్డి, రంగస్థలం, మహానటి..’ వంటి ఎన్నో మంచి సినిమాలొస్తున్నాయి. మంచి నటీనటులు, రైటర్లు, డైరెక్టర్లు ఉన్నారు. పెద్ద బడ్జెట్‌తో సినిమాలు గ్రాండ్‌గా ఉంటున్నాయి. చక్కటి సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నారు అని తమిళ ప్రేక్షకులు అంటుంటే చాలా ఆనందంగా ఉంది.
► ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. ‘పెళ్ళిచూపులు’ సినిమా హిట్ అవుతుందని నేను, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నమ్మకంగా ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. మా అంత బలమైన నమ్మకంగా ఉన్నవారు దొరికితే సినిమా స్టార్ట్ చేస్తా.
► ప్రస్తుతం క్రాంతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నా. ఇంకో ద్విభాషా చిత్రం చేయాల్సి ఉంది. ‘నోటా’ విడుదల తర్వాత నిర్ణయం తీసుకుంటా. ఇటీవల వైరల్ అవుతున్న ఫొటోల్లో మీతో కలిసి ఉన్న ఫారిన్ అమ్మాయి ఎవరు? అనే ప్రశ్నకు.. ‘ఆ ఫొటోల్లో ఉన్నది నేనే. వేరే ఎవరో అని చెప్పను. తను ఓ మంచి అమ్మాయి’ అని నవ్వేశారు.
Comments
Please login to add a commentAdd a comment