సత్తా చాటిన టాలీవుడ్ టాప్ రైటర్
ముంబై: ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో భారీ విజయాలు సాధించిన రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రఖ్యాత దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తండ్రి అయిన ఈయన 2015లో 'బాహుబలి', 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాలకు కథ అందించారు. ఈ రెండు సినిమాలు కలెక్షన్ల కుంభవృష్టి కురిపించి బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్‌ను మరో మెట్టు పైకి ఎక్కించాయి. ఆయన ప్రతిభకు తాజాగా ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ పురస్కారం లభించింది.
2015లో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టిన 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాకు కథ అందించినందుకుగాను ఉత్తమ కథకుడిగా ఆయన ఫిలింఫేర్ అవార్డును పొందారు. పాకిస్థాన్ నుంచి తప్పిపోయి భారత్ వచ్చిన మూగ, చెవిటి బాలికను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చే కథతో 'బజరంగీ భాయ్‌జాన్' సినిమా తెరకెక్కింది. ఇందులో కథాకథనలు, సల్మాన్ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకొని రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.