వివాదంలో విజయ్ ‘కత్తి?’
నటుడు విజయ్ తాజా చిత్రం కత్తి వివాదాల సుడిగుండంలో చిక్కుకోనుందా? ప్రస్తుతం ఈ చిత్రం వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక తమిళుల ఇతివృత్తంతో తెరకెక్కిన కొన్ని చిత్రాలు ఇప్పటికే వివాదానికి గురైన విషయం తెలిసిందే. ఇటీవల ప్రముఖ చాయాగ్రాహకుడు సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఇనం చిత్రం తమిళుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. చివరికి ఆ చిత్ర విడుదలను నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సెగ చల్లారక ముందే మరోసారి మంట రాజుకునే అవకాశం కనిపిస్తోందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఈ సారి ఏకంగా ఇళయ దళపతి విజయ్ చిత్రమే తమిళుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు. విజయ్ తాజాగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి కత్తి టైటిల్ ప్రచారంలో ఉంది. సమంత హీరోయిన్. ఇంతకు ముందు విజయ్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన తుపాకీ ఘన విజయం సాధించడంతో తాజా చిత్రం కత్తిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని లైక్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా నిర్మిస్తున్నారు. అసలు సమస్య ఇక్కేడ తలెత్తనున్నట్లు సమాచారం.
విషయం ఏమిటంటే ఈ అల్లిరాజాకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు ఇంతకు ముందు సన్నిహిత సంబంధాలున్నాయట. మరో విషయం ఏమిటంటే కత్తి చిత్ర పంపిణీ బాధ్యతల్ని పంచుకోవడానికి లైక్ ప్రొడక్షన్, యూకే బెస్ట్ అయింగరన్ సంస్థతో భాగస్వామ్యం పంచుకుందట. కత్తి చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుండడంతో అయిన్‌గరన్ సంస్థ సపోర్ట్‌ను తీసుకున్నట్లు చెబుతోంది. ఈ సంస్థకు కూడా రాజపక్సేకు చెందిన వివిధ దేశాలలో వ్యాపార లావాదేవీలున్నట్లు కొన్ని తమిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తదుపరి చర్యలకు తమిళ సంఘాలు వేచి చూస్తున్నాయి. విజయ్ నటించిన గత చిత్రం తలైవా కొన్ని తమిళ సంఘాల వ్యతిరేకతకు గురై సమస్యలను కొనితెచ్చుకుంది. ఎట్టకేలకు విడుదలైనా అపజయం పాలైంది. తాజా చిత్రం కత్తి విషయంలో అలాంటి వివదాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని కోలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.