ఖుషీఖుషీగా విమల్
యువ నటుడు విమల్ ఖుషీఖుషీగా ఉన్నారు. 2017 నూతనోత్సాహాన్నిచ్చే సంవత్సరంగా ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం లేక పోలేదు. పసంగ చిత్రం విజయంతో దూసుకొచ్చిన ఈ యువ నటుడు కలవాణి, వాగై చూడవా, కలగలప్పు, మాంజా చిత్రాల విజయాలతో తనకంటూ ఒక గుర్తింపును పొందారు.అరుుతే ఇటీవల కాస్త వెనుక బడ్డ విమల్ మళ్లీ ఎగిసిన అలలా వస్తున్నానంటున్నారు. ప్రస్తుతం భూపతి పాండియన్ దర్శకత్వంలో మన్నర్ వగేరా చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోందని విమల్ తెలిపారు.
తదుపరి దర్శకుడు సుశీంద్రన్ నిర్మాణ సంస్థలో ఆయన శిష్యుడు శివ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని అంగీకరించినట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతాన్ని డి.ఇమాన్, మాటలను దర్శకుడు పాండిరాజ్ వంటి ప్రముఖులు పని చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. అదే విధంగా రాజతందిరం చిత్రం ఫేమ్ అమిత్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నట్లు చెప్పారు.అంతే కాకుండా మరో నలుగురు ప్రముఖుల చిత్రాల్లో నటించే విషయై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం మీద 2017 తనకు నూతనోత్సాహాన్నిచ్చే సంవత్సరంగా ఉంటుందనే ఆనందాన్ని నటుడు విమల్ వ్యక్తం చేశారు.