ఈసారైనా లక్కు దక్కేనా?
అవకాశాలు మళ్లీ మళ్లీ వచ్చినా అదృష్టం మాత్రం అరుదుగానే వస్తుంది. అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కోలీవుడ్‌లో అలాంటి అదృష్టం కోసం నటి విమలారామన్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. నిజానికి ఈ మలయాళీ అమ్మడికి అవకాశం చాలా కలం క్రితమే వచ్చింది. రామన్ తేడియ సీతై చిత్రంతో తమిళ చిత్ర రంగానికి పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి ప్రజాదరణనే పొందింది. అంతే కాదు ప్రఖ్యాత దర్శకుడు కే.బాలచందర్ దర్శకత్వంలో పొయ్ అనే చిత్రంలో నటించారు.
అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతే కోలీవుడ్ విమలారామన్‌ను దూరంగా పెట్టేసింది. దీంతో టాలీవుడ్, మాళీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ అంటూ రౌండ్‌లు కొట్టేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో విమలారామన్‌ను మరచిపోయారు. అలాంటిది తాజాగా కోలీవుడ్‌లో ఒక అవకాశం తలుపు తట్టిందన్నది సినీ వర్గాల సమాచారం. ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్ర కథను ఆయన నటి త్రిష కోసం తయారు చేసుకున్నారట.
అయితే ప్రస్తుతం మోహిని చిత్రంలో నటిస్తున్న త్రిష అడిగిన పారితోషికానికి ఈ చిత్ర దర్శక నిర్మాతలకు మూర్ఛ వచ్చినంతపనైందట. దీంతో మరో ఆప్షన్‌గా నటి విమలారామన్ కనిపించడంతో ఆమెను నటింపజేసే పనిలో ఉన్నారని సమాచారం. ఇది యాక్షన్ కథా చిత్రం అని తెలిసింది. ఈ చిత్రంతోనైనా నటి విమలారామన్‌కు లక్కు దక్కేనా? లేక కిక్కే ఇస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. మొత్తం మీద చాలా గ్యాప్ తరువాత విమలారామన్ కోలీవుడ్ తెరపై మెరవనున్నారన్న మాట.