పెరంబూరు: సాధారణంగా ఒక వ్యక్తి విషయంలో రెండు సంఘటనలు జరిగినప్పుడు అందులో ముందు గుడ్ న్యూస్ చెప్పమంటారా? బ్యాడ్ న్యూస్ చెప్పమంటారా? అని అడుగుతుంటారు. ఇప్పుడు కరెక్ట్‌గా నటుడు విశాల్ పరిస్థితి ఇలాంటిదే. ఆనందంతో పాటు అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. విశాల్ వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన సంఘటన చోటు చేసుకున్నా, వృత్తిపరంగా విచారకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కీడెంచి మేలెంచమన్న సామెతను పక్కన పెట్టి ముందు విశాల్‌కు సంబంధించిన మంచి వార్త గురించి చెప్పుకుందాం. మోస్ట్ బ్యాచిలర్ అయిన నటుడు విశాల్ పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన అనీషారెడ్డి అనే నటితో వివాహం నిశ్చయం అయిన విషయం విదితమే. ఆ మధ్య వివాహ నిశ్చితార్థం వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. అయితే వివాహ తేదీని మాత్రం వెల్లడించలేదు. తాజాగా తన పెళ్లి వేడుక అక్టోబర్ 9న జరగనుందని నటుడు విశాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. అయితే వివాహ వేదిక ఎక్కడన్నది ఇంకా నిర్ణయించలేదని ఆయన చెప్పారు.
సమస్యలేంటంటే..
కాగా ఇక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నటుడు విశాల్ దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికల్లో విజయం సాధించి జోడు పదవుల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా వీటిలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మండలిలో అవినీతి, అవకతవకలు జరిగాయంటూ వ్యతిరేక వర్గం ఆరోపణలను గుప్పిస్తున్నారు. మండలి కార్యవర్గం ఏ విషయంలోనూ విధి, విధానాలు పాఠించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిణామాల్లో మండలిలో వ్యతిరేక వర్గం ఫిర్యాదు మేరకు ప్రభుత్వం మండలి నిర్వహణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. అందుకు ఎన్.శేఖర్ అనే రిజిస్ట్రార్‌ను ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఇది విశాల్ వర్గాన్ని షాక్‌కు గురిచేసింది. దీంతో ప్రభుత్వ చర్యల్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే ప్రభుత్వం విశాల్ వర్గానికి మరో షాక్ ఇచ్చింది.
మండలికి ప్రత్యేక అధికారిగా నియమించిన ఎన్.శేఖర్‌కు సహాయ, సహకారాలను అందించే విధంగా తాత్కాలిక అడహాక్ కమిటీని నియమించింది. అందులో విశాల్ వ్యతిరేక వర్గానికి చెందిన దర్శకుడు భారతీరాజా, నటుడు కే.రాజన్, టీజే.త్యాగరాజన్ 9 మందిని సభ్యులుగా నియమించింది. దీన్ని వ్యతిరేకిస్తూ విశాల్ వర్గం మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ సారి హైకోర్టులో కూడా విశాల్ వర్గానికి చుక్కెదురైంది. శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్తానం అడహాక్ కమిటీని రద్దు చేయలేమని తీర్పులో పేర్కొంది. ప్రభుత్వం నియమించింది ప్రత్యేక అధికారికి తాత్కాలిక సలహా అడహాక్ కమిటీని నియమించిందని, దాన్ని రద్దు చేయడం వీలుకాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈ అడహాక్ కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని పేర్కొన్నారు. ఈ తీర్పు కూడా విశాల్ వర్గానికి అవమానకరమైన విషయమే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment