
ఇంటి గడప దాటుతున్న ఇంతులు!
స్వేచ్ఛగా బతకడం అంటే ఏంటి?... అనే ప్రశ్నకు ఎవరెన్ని రకాలుగా సమాధానాలిచ్చినా, హిందీ రంగంలో కొంతమంది కుర్ర...
స్వేచ్ఛగా బతకడం అంటే ఏంటి?... అనే ప్రశ్నకు ఎవరెన్ని రకాలుగా సమాధానాలిచ్చినా, హిందీ రంగంలో కొంతమంది కుర్ర కథానాయికలు మాత్రం ‘అమ్మ, నాన్నకు దూరంగా వేరే ఇంట్లో ఉండటం’ అని సమాధానం ఇచ్చేంతగా ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు. సరే.. వేరే నగరం నుంచి ముంబయ్‌లో అడుగుపెట్టి, సినిమాలు చేస్తున్న తారలైతే అమ్మ, నాన్నకు దూరంగా ఉండక తప్పదు.
కానీ, ముంబయ్ మహానగరంలోనే పుట్టి, పెరిగిన తారలు కూడా అమ్మ, నాన్నలకు దూరంగా ఇల్లు తీసుకుని, ఒంటరిగా ఉండాలనుకోవడం విచిత్రం. అఫ్‌కోర్స్ పెళ్లయితే ఫర్వాలేదు. కానీ, పెళ్లి కాని ఆలియా భట్, శ్రద్ధాకపూర్ వంటివాళ్లు కూడా విడిగా ఇల్లు తీసుకుని ఒంటరి జీవితం గడిపే ప్రయత్నం మీద ఉన్నారు..
పెద్దవాళ్లతో కలిసి ఉంటే ఓ రక్షణ ఉంటుంది కదా? అని ఈ ముద్దుగుమ్మలకు ఎవరూ బుద్ధి చెప్పడానికి సాహసం చేయడంలేదట. ఒకవేళ చెప్పడానికి ప్రయత్నించినా, ‘‘మాది నైన్ టూ సిక్స్ జాబ్ కాదు కదా.. అర్ధరాత్రి దాటాక, ఒక్కోసారి తెల్లవారుజాము.. ఇలా ఎలా పడితే అలా ఇంటికి వెళతాం. మావాళ్లకు డిస్టర్బెన్స్...’’ అనే తరహాలో సమాధానం చెబుతున్నారట. ప్రియాంకా చోప్రా అయితే.. ‘మా అమ్మగారే నన్ను విడిగా ఉండమన్నారు. అప్పుడే జీవితం గురించి మంచి అవగాహన వస్తుందన్నారు’ అని చెబుతున్నారట. ఇక, క్యూట్ గాళ్ ఆలియా భట్ అయితే, ‘వేళాపాళా లేని నా ఉద్యోగంతో మా అమ్మ, నాన్నకు సమస్య..
ఏ సమయంలో పడితే ఆ సమయంలో కాలింగ్ బెల్ నొక్కితే వాళ్ల నిద్ర పాడవుతుంది’ అని సన్నిహితులతో అంటున్నారట. అందుకే, ప్రస్తుతం ముంబయ్ వీధుల్లో వలేసి మరీ, మంచి ఇంటి కోసం వెతుక్కుంటున్నారని భోగట్టా. ఈ వ్యవహారం విన్నవాళ్లు ‘ఆలియా తండ్రి మహేశ్‌భట్ పెద్ద దర్శకుడు, నిర్మాత. వేళాపాళా లేని ఉద్యోగం చేసిన ఆయన మరి.. తన కుటుంబాన్ని వదిలి విడిగా ఉండలేదు కదా’ అని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి తన కూతురు విడిగా ఉండటం మహేశ్‌భట్‌కి కూడా ఇష్టం లేదట.
కానీ, ఆలియా ససేమిరా అంటే ఆయన మాత్రం ఏం చేస్తారు? మరో ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ కూడా అమ్మ,నాన్న ఉంటున్న ఇంటి గడప దాటేయాలనుకుంటున్నారట. ఆలియా భట్‌లానే ఇల్లు వెతు క్కుంటున్నారట. ఆమె తండ్రి శక్తికపూర్ కూడా ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన నటుడేననీ, కానీ, ఆయన ఒంటరిగా ఉండాలని ఎందుకు అనుకోలేదని బాలీవుడ్‌లో జోకేసుకుంటున్నారు. శ్రద్ధాకపూర్‌ని ఇంటి విషయం గురించి ఎవరైనా అడిగితే... ‘అలాంటిదేమీ లేదండి బాబు. నేను ఇల్లు వెతకడంలేదు అంటున్నారట. కానీ, ఇంటి అన్వేషణ పూర్తిగా నిజమని బాలీవుడ్ వారు అంటున్నారు. మరి.. ఒంటరి జీవితంలో ఏం మజా ఉంటుందో వీళ్లకే తెలియాలి...