న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన సంచలనాత్మక చిత్రం ‘బాహుబలి–2’ చిత్రంపై సెన్సార్ కత్తెర పడిందా ? పడితే ఎలాంటి సీట్లను కత్తిరించారన్న ఆసక్తి కలుగుతోంది. చిత్రంలోని రణరంగానికి సంబంధించిన సన్నివేశాల్లో తలలు తెగనరికితే రక్తం చిమ్మే కొన్ని భయానక దృశ్యాలకు మాత్రమే సెన్సార్ బోర్డ్ కట్లు చెప్పింది.
రానా, ప్రభాస్‌ల ఇద్దరి మధ్య జరిగే యుద్ధానికి సంబంధించిన కొన్ని దృశ్యాలపై కూడా సెన్సార్ బోర్డు కత్తెర విధించగా, ఆ మేరకు సెన్సార్ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని చిత్ర దర్శకుడు రాజమౌళి పునర్ షూటింగ్ జరిపి వాటిని నిడివి తగ్గకుండా జోడించారు. మిగతా అభ్యంతరకర దృశ్యాలను మాత్రం యథాతధంగా తొలగించారు.
సినిమాలో కట్లు సూచిస్తూ హైదరాబాద్‌లోని సీబీఎఫ్‌సీ రీజనల్ అధికారి పీవీఆర్ రాజశేఖరం జారీ చేసిన ఉత్తర్వుల కాపీ మీడియాకు దొరికింది. హిందీ వర్షన్ బాహుబలికి మాత్రం ఒక్క కట్ కూడా చెప్పకుండా సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. బహుశా తెలుగు వెర్షన్‌పై వ్యక్తం చేసిన అభిప్రాయలను పరిగణనలోకి తీసుకొని నిర్మాత ముందుగానే వాటిని హిందీ వర్షన్ నుంచి తొలగించి ఉండవచ్చు.