సెక్స్ స్కాండల్‌వుడ్.. ఇప్పుడు హాలీవుడ్‌కు ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ అరాచకాలు బయటపడ్డ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా ‘మీటూ..’ అన్న ఉద్యమం ఏ స్థాయిలో జరుగుతోందో చెప్పక్కర్లేదు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వెయిన్‌స్టీన్ తమపై చేసిన లైంగిక వేధింపుల గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఎంతోమంది గొంతు విప్పారు. ఈ సంఘటన జరిగి రెండు నెలలైనా ఇప్పటికీ మీటూ ఉద్యమం అలాగే ఉంది. అలాగే హాలీవుడ్‌లో ఈ లిస్ట్ వెయిన్‌స్టీన్ దగ్గరే ఆగిపోలేదు.
అదలా రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఎక్కడికెళ్లినా మీడియా అడుగుతోన్న ప్రశ్న ఒక్కటే.. ‘‘సెక్స్ స్కాండల్స్ గురించి మీరేమంటారు?’’ అని. చిత్రమేమిటంటే.. పలువురు స్టార్స్ కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారి జాబితాలో ఉండడం. ఓలివర్ స్టోన్, సిల్వెస్టర్ స్టాలోన్, అల్ ఫ్రాంకెన్, గారిసన్ కిల్లర్, లూయిస్ సీకె, కెవిన్ స్పేసీ, చార్లీ షీన్.. ఇలా చాలామంది స్టార్స్‌పై ఆరోపణలు వస్తున్నాయి. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ, పడుతున్న వారి గురించి హీరోయిన్స్ ధైర్యంగా బయటకొచ్చి చెబుతున్నారు. ‘మీటూ..’ హాలీవుడ్‌లో హీరోయిన్లకు ఓ కొత్త ఆయుధంలా తయారైంది.
నాకేం ఆశ్చర్యం కలిగించలేదు!
ఈ సెక్స్ స్కాండల్స్ గురించి ప్రముఖ నటుడు టామ్ హ్యాంక్స్ మాట్లాడుతూ –‘‘నాకేం ఆశ్చర్యంగా అనిపించడంలేదు. లైంగిక వేధింపులకు గురిచేసేవాళ్లు అన్ని చోట్లా ఉన్నారు. సినిమా అనే బిజినెస్‌ను ఒక గౌరవంగా భావించే వాళ్ల వల్ల ఏ నష్టమూ జరగదు. పవర్ కోసం, వేరే లాభాల కోసం సినిమాని ఆయుధంగా ఉపయోగించుకునేవాళ్లు ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. హాలీవుడ్ అంటే జస్ట్ సెక్స్ స్కాండల్స్ కాదు. మంచి విషయాలు కూడా చాలా ఉన్నాయి. చెడు పరంగా పరిస్థితులు తప్పకుండా మారతాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment