
తమిళ అభిమానులు రజనీకాంత్‌ను దైవంలా ఆరాధిస్తారు. కేవలం సౌత్‌కే కాదు ఇండియాకే సూపర్‌స్టార్ రజనీ. అతని స్టైల్‌కి ప్రపంచమంతటా ఫ్యాన్సే. అలాంటిది.. రజనీ తన తర్వాత స్థానంలో ఎవరుండొచ్చు అనే అంశంపై ఓ హింట్ ఇవ్వడం ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా రజనీ అభిమానులతో సమావేశం అవుతున్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్ మీటింగ్‌లో రజనీ మాట్లాడుతూ...‘‘ రాజకీయాల్లోనైనా, సినిమాల్లోనైనా సమయం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. సమయాన్ని బట్టి పరిస్థితులు మారుతుంటాయి. ఒకప్పుడు నేను మా స్నేహితుని పెళ్లికి కోయంబత్తూర్ వెళ్లాను. నాతో శివాజీ గణేశన్ కూడా ఉన్నారు. ఇద్దరం ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అందరూ రజనీ... రజనీ.. అంటూ కేకలు వేశారు. అప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే నేను ఒక లెజెండ్ పక్కన నిల్చొని ఉన్నాను. శివాజీ గణేశన్ పక్కన ఉండగా నా గురించి అభిమానులు కేకలు వేయడం ఇబ్బందిగా అనిపించింది. అది చూసి శివాజీ గణేశన్...‘మేము మా సమయంలో ఎన్నో మంచి సినిమాలు చేశాము. ఇప్పుడు ఇది నీ సమయం.. నువ్వు ఎదిగే సమయం.. ఇంకా మంచి సినిమాల్లో నటించు, బాగా కష్టపడు’ అన్నారు. సరిగ్గా కొన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్లీ కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సివచ్చింది.
అదే ఎయిర్ పోర్ట్కి మరో స్టార్ హీరో వచ్చారు. దీంతో ఆ హీరో అభిమానులు చాలా మంది అక్కడే ఉన్నారు. ఇప్పుడు మీరు వస్తే ఇబ్బందిగా ఉంటుందని.. అక్కడి నుంచి నాకొక మెసెజ్ వచ్చింది. సరే అతను వెళ్లిన తర్వాతనే వస్తానని చెప్పాను. అప్పుడు నాకు శివాజీ గణేశన్ మాటలు గుర్తొచ్చాయి.. సమయం ఇంకొకరికి వచ్చింది అని అనుకొన్నా' అని రజనీకాంత్ తెలిపారు. అయితే ఆ హీరో ఎవరూ అనే విషయాన్ని రజనీ క్లారీటీ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో చర్చనీయాంశమైంది.