ప్రీతి జింతాకు షారూఖ్ సారీ ఎందుకు?
ముంబై: బాలీవుడ్ 'కింగ్ ఖాన్' షారూఖ్ ఖాన్.. హీరోయిన్ ప్రీతి జింతాకు క్షమాపణ చెప్పాడు. వీరిద్దరూ నటించిన 'దిల్ సే' సినిమా విడుదలై 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా షారూఖ్ ప్రత్యేకంగా తయారు చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. 'మనం ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడినప్పుడు వారిని ఎంతో ప్రేమిస్తాం. అయితే ఎల్లకాలం ఎక్కువగా ప్రేమించడం సాధ్యంకాకపోవచ్చు. కానీ నాకు ఎంతో ఇష్టమైన దిల్ సే సినిమాపై ప్రేమ కాస్త కూడా తగ్గలేద'ని ఇన్స్టాగ్రామ్ వీడియోకు మెసేజ్ పెట్టాడు. అయితే ఈ వీడియో హీరోయిన్ ప్రీతి జింతా ప్రస్తావన లేకపోవడంతో ఆమెకు షారూఖ్ క్షమాపణ చెప్పాడు. వీడియోలో ప్రీతి జింతాను కూడా చేర్చి మరోసారి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు.
విలక్షణ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'దిల్ సే' సినిమా 1998, ఆగస్టు 21న విడుదలైంది. ఇందులో షారూఖ్ సరసన మనీషా కొయిరాల, ప్రీతి జింతా నటించారు. తీవ్రవాదం నేపథ్యంలో రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మణిరత్నం, రాంగోపాల్ వర్మ, శేఖర్ కపూర్, భరత్ షా సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఈ సినిమాతోనే ప్రీతి జింతా బాలీవుడ్ ను పరిచయమైంది.