ఇంకొక్క రోజు ఆగితే కొన్ని నెలలుగా సాగుతున్న ఆసక్తికి తెర పడనుంది. ప్రపంచ సినీ ప్రియుల సినిమా పండగకు తెర లేవనుంది. ఆస్కార్.. హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చుకునే అవార్డుల వేడుక. ప్రపంచం మొత్తం ఈ అవార్డుల వేడుక మనందరిదే అంటూ ఆపాదించుకున్న పాపులర్ అవార్డ్ ఫంక్షన్. అండ్ ది ఆస్కార్ గోస్ టు అంటూ... ఉత్తమ చిత్రంగా ఏ సినిమా నిలవనుంది? బెస్ట్ హీరోయిన్‌గా స్పీచ్‌ని ఎవరు ఇవ్వబోతారు? అనే డిస్కషన్లకు, ఊహాగానాలకు సోమవారం సమాధానం దొరకనుంది. 91వ ఆస్కార్ అవార్డుల వేడుక భారతీయ కాలమాన ప్రకారం 25 ఫిబ్రవరి సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు జరగనుంది. రెడ్ కార్పెట్ పై నడిచే సెలబ్రిటీలు, లేడీ గాగా ప్రత్యేక ప్రదర్శన ఈ అవార్డు్డ వేడుకకు హైలైట్‌గా నిలవనుంది. ఏయే కేటగిరీల్లో అవార్డు ఎవరికొస్తుందో విశ్లేషించి చూసుకుంటే..
ఉత్తమ చిత్రం: ఈ ఏడాది అందరి ఆసక్తి సంపాదించిన చిత్రాలు ‘రోమా, ది ఫేవరెట్’. ఈ రెండు సినిమాలూ పదేసి నామినేషన్లు సంపాదించడమే ఒక కారణం కూడా. ఉత్తమ చిత్రాల విభాగానికి వస్తే.. బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కిన ‘రోమా’ ఆస్కార్ అవార్డ్స్‌లో సేఫ్ బెట్‌గా అనిపిస్తోంది. ఇటీవల జరిగిన బ్రిటీష్ ఫిల్మ్ అవార్డ్స్‌లో కూడా ‘బెస్ట్ పిక్చర్, డైరెక్టర్’ కేటగిరీల్లో విజయం సాధించింది. ఆ తర్వాత ఛాన్స్ ‘గ్రీన్ బుక్’ చిత్రానికి ఉంది. బెస్ట్ పిక్చర్‌గా గోల్డెన్ గ్లోబ్ సాధించింది ‘గ్రీన్ బుక్’. ‘రోమా’ కంటే ‘గ్రీన్‌బుక్’కు అవార్డు వచ్చే చాన్స్‌కి కారణం ఎడిటింగ్. ఎడిటింగ్ విభాగంలో స్ట్రాంగ్‌గా నిలిచిన చిత్రాలు బెస్ట్ పిక్చర్ అవార్డ్‌ను సాధించినవిగా చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత ‘ది ఫేవరెట్, బ్లాక్‌ల్యాన్స్‌మ్యాన్, బ్లాక్ ఫ్యాంథర్’ చిత్రాలకు అవకాశముంది. సూపర్ హీరో సినిమాలను పెద్దగా పట్టించుకోని ఆస్కార్ ఈ ఏడాది ‘బ్లాక్ ఫ్యాంథర్’కి నామినేషన్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. బెస్ట్ పిక్చర్‌గా నిలిస్తే సూపర్ హీరో మేజిక్ పని చేసిందనుకోవడమే. ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’ బెస్ట్ పిక్చర్ లిస్ట్‌లో ఉన్నా కూడా బెస్ట్ సాంగ్ కేటగిరీలో మాత్రమే అవార్డు కొడుతుందన్నది పలువురి అంచనా.
ఉత్తమ దర్శకుడు: దర్శకుల విభాగంలో ఎవరు గెలుస్తారు అనే చర్చ కంటే స్పైక్‌లీ గెలిస్తే ఏంటి? అన్న చర్చ ప్రధానంగా మారింది. ఆస్కార్ అవార్డు నల్ల జాతీయులకు అందని ద్రాక్షే అన్నది ఆస్కార్ సత్యం. స్పైక్‌లీ ఆస్కార్‌ని సొంతం చేసుకోగలిగితే ఆస్కార్‌ని ముద్దాడబోయే తొలి నల్ల జాతీయ దర్శకుడిగా రికార్డ్ సృష్టించడం ఖాయం. ‘రోమా’ దర్శకుడు ఆల్ఫెన్స్ ఆల్రెడీ ‘గ్రావిటీ’తో ఆస్కార్‌ని అందుకోగా, ‘వైస్’ దర్శకుడు ఆడమ్ మెక్కీ ఓసారి ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు. పావెల్ పావిల్కోవిస్కీ (కోల్డ్ వార్), యోర్గొస్ లాంథిమోస్ (ది ఫేవరెట్).. ఈ దర్శకుల్లో ఆస్కారం ఎవరికో?
ఉత్తమ నటుడు: యాక్టర్‌గా ప్రతి పాత్రతో విభిన్నతను చూపిస్తుంటారు క్రిస్టిన్ బేల్. అయితే ఇప్పటివరకూ ఆస్కార్ అందుకోలేకపోయారాయన. ఇన్నాళ్ల ఈ వెయిటింగ్ అంతా వెయిట్‌గా మార్చి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ డిక్ చెన్నే పాత్రలో కనిపించారు బేల్. రెండేళ్లక్రితం లియోనార్డో డికాప్రియో ఆస్కార్ కల తీరినట్టే క్రిస్టిన్ కల కూడా నెరవేరనుందా? బేల్ కంటే రమి మాలిక్ (బొహె మియన్ రాప్సోడి)కి చాన్స్ ఎక్కువ అని జరుగుతున్న చర్చలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ రేస్‌లో ఉంది బ్రాడ్లీ కూపర్. ఈ ముగ్గురూ కాకుండా వొగ్గో మార్టిసన్, మిలిమ్ డాఫోయి గెలిస్తే కచ్చితంగా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌లానే ఉంటుంది.
ఉత్తమ నటి: బెస్ట్ యాక్ట్రస్ పోటీలో మొహమద్ గజనీ గ్లెన్ క్లోస్ (ది వైఫ్) ముందు వరుసలో ఉన్నారు. ఏడుసార్లు ఆస్కార్ నామినేషన్‌లో నిలిచినా ఆస్కార్ బెస్ట్ యాక్టర్ స్పీచ్ ఇవ్వడానికి ఛాన్స్ రాలేదామెకు. గ్లైన్ తర్వాత ఒలీవియా కోల్మన్ ఉన్నారు. వీరిని దాటితే లేడీ గాగా చేతిలో ఆస్కార్ పడే అవకాశముంది. మెలిసా మెక్కార్తీ, తొలి సినిమాతోనే ఆస్కార్ నామినేషన్ అందుకున్న యలిట్జా అపరికోయ పోటీలో ఉన్నారు. ఈ నామినీల్లో ఆస్కార్‌ని అందుకునేది ఎవరు? 30 సెకన్ల స్పీచ్ ఇచ్చేదెవరు? అనేది రేపు తెలుస్తుంది.
వివాదం
ఈ ఏడాది ఆస్కార్‌లో మోతాదుకి మించిన వివాదం ఏర్పడింది. హోస్ట్ లేకపోవడం. ఓ నాలుగువిభాగాలను లైవ్‌లో కాకుండా ఎడిట్ చేస్తామని పేర్కొనడంతో హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటీనటుల నుంచి మిశ్రమ అభిప్రాయం రావడంతో ఆ ఆలోచనను వెనక్కు తీసుకుంది కమిటీ. పాపులర్ ఫిల్మ్ అనే కొత్త కేటగిరీలో ఈ ఏడాది అవార్డ్ ప్రదానం చేయాలనుకుంది. దాన్ని మళ్లీ తొలగించింది. అవార్డుల వేడుక నిడివి మించిపోతుందని బెస్ట్ సాంగ్ విభాగంలో ఎంపికైన అందరూ ఆ పాటకు వేదిక మీద పర్ఫార్మ్ చేయడం కుదరదని అకాడమీ పేర్కొంది. అందరూ ప్రదర్శించే చాన్స్ ఇవ్వకపోతే నేనూ చేయనని పేర్కొన్నారు లేడీ గాగా. ∙గతేడాది బెస్ట్ యాక్టర్ ఆస్కార్‌ని అందుకున్న నటులు కొత్తగా అవార్డులను స్వీకరించే వాళ్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. తొలుత గతేడాది అవార్డు గ్రహీతలు అవార్డు ప్రకటించకపోవచ్చని పేర్కొని, ఆ తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకుంది. ఇలా ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత మార్చుకోవడంతో ‘ఈ ఆస్కార్ కమిటీకి ఏం జరిగింది? ఎందుకీ కన్‌ఫ్యూజన్’ అని హాలీవుడ్‌లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment