W/O Ram Review | ‘W/O రామ్‌’ మూవీ రివ్యూ | Wife of RAM Telugu Movie Review - Sakshi
Sakshi News home page

‘W/O రామ్‌’ మూవీ రివ్యూ

Published Fri, Jul 20 2018 10:32 AM | Last Updated on Sun, Jul 14 2019 3:30 PM

Wife Of Ram Telugu Movie Review - Sakshi

టైటిల్ : W/O రామ్‌
జానర్ : థ్రిల్లర్‌
తారాగణం : మంచు లక్ష్మీ, ప్రియదర్శి, ఆదర్శ్‌, సామ్రాట్‌
సంగీతం : రఘు దీక్షిత్‌
దర్శకత్వం : విజయ్‌ ఎలకంటి
నిర్మాత : టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబోట్ల, మంచు లక్ష్మీ

స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఇప్పటికే విలక్షణ పాత్రలో మెప్పించిన ఆమె తాజాగా W/O రామ్‌ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగు తెర మీద అరుదుగా కనిపించే క్రైం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్‌ ఎలకంటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టీజర్‌, ట్రైలర్‌లతోనే ఇంట్రస్ట్ క్రియేట్‌ చేసిన W/O రామ్‌ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? నటిగా మంచు లక్ష్మీ మరోసారి ఆకట్టుకున్నారా..?

కథ;
గాయపడిన ఆరునెలల గర్భవతి ‘దీక్ష’ (మంచు లక్ష్మీ) హాస్పిటల్‌లో కోలుకుంటుంది. కళ్లు తెరిచిన దీక్షకు తన భర్త రామ్‌ (సామ్రాట్‌), కడుపులోని బిడ్డ చనిపోయారని తెలుస్తుంది. అప్పటి వరకు ప్రమాదంగా భావిస్తున్న పోలీసులకు తన భర్తది హత్య చేశారని, హుడీ వేసుకున్న వ్యక్తి తనను గాయపరిచి తన భర్తను లోయలో పడేశాడని చెపుతుంది. ఎన్ని రోజులు గడిచినా పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ ముందుకు కదలకపోవటంతో తానే స్వయంగా ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో రమణ చారీ (ప్రియదర్శి) అనే కానిస్టేబుల్‌ దీక్షకు సాయం చేస్తాడు. ఎంతో కష్టపడి ఈ క్రైం వెనుక ఉన్నది బ్యాంకాక్‌లో ఉండే రాఖీ (ఆదర్శ్‌) అని దీక్ష తెలుసుకుంటుంది. ఈలోగా విషయం తెలుసుకున్న ఆదర్శ మనుషులు.. దీక్షను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రమాదాల నుంచి దీక్ష ఎలా తప్పించుకుంది..? రామ్‌ మరణానికి కారణం ఏంటి..? రాఖీని ఎలా అంతం చేసింది..? దీక్ష అంత రిస్క్‌ చేసి తానే స్వయంగా ఇన్వెస్టిగేషన్‌ చేయడానికి కారణం ఏంటి..? అన్నదే మిగత కథ.

నటీనటులు ;
సినిమాను మంచు లక్ష్మీ వన్‌ ఉమెన్‌ షోలా నడిపించారు. కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో ఒకటి రెండు సీన్స్‌ తప్ప మంచు లక్ష్మీ తెరమీద కనిపించని సీన్స్‌ ఉండవు. ఇంత బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశారు లక్ష్మీ. భర్తను కోల్పోయిన బాధను దిగమింగుతూ అతని చావుకు కారణాలు వెతికే మహిళగా మంచి నటన కనబరిచారు. కొన్ని సన్నివేశాల్లో ఆమె ఎమోషన్స్‌ ను అండర్‌ ప్లే చేసిన తీరు సూపర్బ్ అనిపిస్తుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. సిన్సియర్‌ సీరియస్ కానిస్టేబుల్‌గా మెప్పించాడు. కరప్టడ్‌ పోలీస్‌ పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మంచి నటన కనబరిచాడు. ఆదర్శ్‌ విలన్‌ రోల్‌ లో పర్ఫెక్ట్ గా ఫిట్‌ అయ్యాడు. సామ్రాట్‌ది నటనకు పెద్దగా అవకాశం లేని అతిథి పాత్రే.

విశ్లేషణ ;
తొలి సినిమానే థ్రిల్లర్‌ జానర్‌ లో చేసే ప్రయత్నం చేసిన దర్శకుడు విజయ్‌ ఎలకంటి తన వంతు ప్రయత్నం చేశాడు. ఎక్కడా తాను అనుకున్న జానర్‌ నుంచి పక్కకుపోకుండా పర్ఫెక్ట్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. కమర్షియాలిటీ కోసం పాటలు, కామెడీ ఇరికించకుండా కథను నడిపించాడు. అయితే థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన వేగం మాత్రం కథనంలో కనిపించలేదు. భర్త, బిడ్డను కోల్పోయిన ఒంటరి మహిళను కుటుంబ, సభ్యులు చుట్టాలు పట్టించుకోకపోవటం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌ లో వచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగానే ఉన్నా.. తరువాత వచ్చే సీన్స్ ఆ స్థాయిలో లేవు. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌ రఘు దీక్షిత్‌ మ్యూజిక్‌. చాలా సన్నివేశాలను రఘు మ్యూజిక్ డామినేట్‌ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
మంచు లక్ష్మీ నటన
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ ;
కథనంలో వేగం లేకపోవటం

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్                                                    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement