అదే జరిగితే...విదేశాల్లో స్థిరపడతాను!
‘‘ఏ దేశం వెళ్లినా నా మాతృదేశాన్ని మర్చిపోను. ఈ దేశం పట్ల నాకున్న సెంటిమెంట్స్, నా భాష, నా సంస్కృతీ సంప్రదాయాల్లో మార్పు రాదు’’ అంటున్నారు కమల్‌హాసన్. ప్రయోగాలకు చిరునామా అనే విధంగా ఎన్నో విభిన్న పాత్రలు చేసి, భారతీయ నటుల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారాయన. అలాంటి కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ విడుదల అప్పుడు, ‘నన్ను ఇంకా ఇబ్బందులపాలు చేస్తే, వేరే రాష్ట్రానికి వెళ్లిపోతా.. లేకపోతే వేరే దేశానికే వెళ్లిపోతా’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘విశ్వరూపం 2’ చేస్తున్నారు.
దర్శకత్వం, నటన.. ఇలా ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తూ కమల్ రూపొందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఒకవేళ తొలి భాగానికి వచ్చినట్లే, ఈ మలి భాగానికీ సమస్యలు ఎదురైతే అప్పుడేం చేస్తారు? అనే ప్రశ్న కమల్ ముందుంచితే -‘‘అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నానో ఇప్పుడూ ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నా. స్వదేశం వదిలి విదేశాల్లో స్థిరపడతా. నేను కళాకారుణ్ణి. ఎమ్‌ఎఫ్ హుస్సేన్ చేసినట్లుగా వేరే ప్రాంతానికో, రాష్ట్రానికో, దేశానికో వెళ్లిపోతా. ఇది బెదిరింపు కాదు.. రాజీనామా’’ అన్నారు ఉద్వేగంగా.