
అది క్షమించరాని నేరం!
భారత దేశంలో స్త్రీలకు రక్షణ కరువైందా? ఇందుకు అవుననే సమాధానమే వస్తోంది మహిళా లోకం నుంచి. ఈ ఆధునిక యుగంలో స్త్రీలు మగవారికి ఎందులోనూ తీసిపోనంతగా రాణిస్తున్నారు. అయినా కొందరు మానవ మృగాలు స్త్రీని ఒక ఆట వస్తువుగానే చూస్తున్నారు. వారి అఘాయిత్యాలకు మహిళలు బలైపోతూనే ఉన్నారు. అన్ని రకాలుగా బలపడిన స్త్రీలు కూడా ఒక్కోసారి మగవాడి పైశాచికత్వం నుంచి బయట పడలేకపోతున్నారు. ఇందుకు నటి భావన ఉదంతమే ఒక నిదర్శనం.
ఆమెకు జరిగిన అఘాయిత్యాన్ని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఖండిస్తున్నారు.అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని గళమెత్తున్నారు.చాలా మంది నటీమణులు భావనకు అండగా నిలుస్తున్నారు.నటి వరలక్ష్మీశరత్‌కుమార్, స్నేహ, సంధ్య ఇలా పలువురు భావనపై అత్యాచారయత్నాన్ని తీవ్రంగా ఖండించారు.తాజాగా నటి శ్రుతీహాసన్ స్పందిస్తూ విదేశాల్లో మహిళలకు రక్షణ ఉంటుందన్నారు.
భారతదేశంలో మాత్రం ఇంకా అభద్రతాభావంతో గడుపుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు మానవ రక్షణ కరవైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.నటి భావనపై లైంగికయత్నం క్షమించరాని నేరంగా పేర్కొన్నారు.అలాంటి అఘాయిత్యాయలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.అప్పుడు ఇలాంటి ఘటనలకు అడ్డుకట్టపడుతుందని మంగళవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి శ్రుతీహాసన్ అన్నారు.