న్యూఢిల్లీ: బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టాలెంట్ షోగా ప్రసారమవుతున్న ‘ఇండియా గాట్ టాలెంట్’ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న కిరణ్ ఖేర్ ఇకపై కూడా ఆ స్థానంలో కొనసాగుతానని చెబుతున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చండీగఢ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె గెలుపొందిన విషయం తెలిసిందే. ఎంపీగా బాధ్యతలు పెరగడంతో ఇకపై టాలెంట్ షోలో పాల్గొంటారా? లేదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ... ‘కార్యక్రమాన్ని చూస్తూ ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ నేనూ అంతే ఎంజాయ్ చేస్తున్నాను. ఇకపై కూడా న్యాయనిర్ణేతగానే కొనసాగుతాను.
మిగతా సమయాన్నంతా చండీగఢ్ ప్రజల సమస్యల పరిష్కారానికి కేటాయిస్తాను. ఎన్నికల ప్రచార సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాను. నా ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే ప్రచారం చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రోజుకు కేవలం ఐదుగంటలు మాత్రమే నిద్రపోయాను. మిగతా సమయాన్ని ప్రచారం కోసం కేటాయించాను.
అందుకే కార్యక్రమాన్ని కొన్నిరోజుల కోసం వదులుకోవాల్సి వచ్చింది. ఇకపై న్యాయనిర్ణేతగా కొనసాగాలని అనుకుంటున్నాను. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీదే. పార్టీ అధిష్టానం నాపై మరిన్ని బాధ్యతలు మోపితే వాటిని కూడా నెరవేర్చాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం కష్టం కావొచ్చు. కేవలం ఎంపీగా బాధ్యలు మాత్రమే నాపై ఉంటే అటు ప్రజలకు సేవ చేయడంతోపాటు న్యాయనిర్ణేతగా కొనసాగడం కష్టమేమీ కాదనుకుంటున్నా. అయితే దీనిపై స్పష్టత మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశముంద’న్నారు.
‘ఇండియా గాట్ టాలెంట్’ను వదులుకోను
Published Wed, May 21 2014 10:44 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement