బాలీవుడ్ భామల చేతిలో పవన్ భన్సల్ భవితవ్యం!
లోకసభ ఎన్నికల్లో ఫ్రెంచ్ అర్కిటెక్ట్ లీ కర్బూసియర్ రూపొందించిన చంఢీఘడ్ నగరంలో ఎన్నికల పోరు దేశవ్యాప్తంగా ఆకర్షిస్తోంది. చంఢీఘడ్ నియోజకర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగు సార్లు గెలుపొందిన పవన్ కుమార్ భన్సల్, బాలీవుడ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నటి గుల్ పనాగ్, బీజేపీ అభ్యర్థిగా కిరణ్ ఖేర్ లు పోటి చేయడమే అందుకు కారణం. ఇదే నియోజకవర్గంలో బీఎస్పీ తరపున జన్నత్ జహన్ అనే మహిళ కూడా పోటిలో ఉన్నారు.
రైల్వేశాఖలో ఉద్యోగ కుంభకోణంలో మేనల్లుడు అరెస్ట్ కావడంతో పవన్ కుమార్ భన్సల్ పై కూడా ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం నుండి బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే చంఢీఘడ్ నియోజకవర్గంలో మంచి పలుకుబడి, గట్టి పట్టున్న భన్సల్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడంతో ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటి చేస్తున్న గుల్ పనాగ్ ఓటర్లను ఆకర్షించేందుకు బుల్లెట్ పై ప్రచారం చేయడం, ఉదయమే పార్కుల్లో తిరగడం, వీధుల్లో తిరుగుతూ సమస్యలను సావధానంగా వినడం లాంటి అంశాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల కేజ్రీవాల్ రోడ్ షోకు మంచి స్పందన రావడంతో గెలుపుపై గుల్ పనాగ్ లో విశ్వాసం పెరిగింది.
ఇక బీజేపీ అభ్యర్థి, అనుపమ్ ఖేర్ సతీమణి, కిరణ్ ఖేర్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కుంభకోణాలు బీజేపీకి విజయాన్ని అందిస్తాయని ఆశలు పెట్టుకున్నారు. అవినీతితో దేశాన్ని భ్రష్టుపట్టించిందని.. ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిన పడాలంటే మోడీ సేవలు ఎంతో అవసరం ఉందని.. అందుకే ఈసారి కమలానికి ఓటు వేయాల్సిందేనని ఓటర్లకు విజ్క్షప్తి చేస్తున్నారు.
ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో 50 శాతానికి పైగా 45 ఏళ్ల వయస్సు లోపువారే ఉండటంతో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు యువ ఓటర్లపై కన్నేశారు. చంఢీఘడ్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసే వారి సంఖ్య 23 వేల పైగానే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళా, యువ ఓటర్లతోపాటు, తొలిసారి ఓటు వినియోగించుకునే వారు ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. ఇలాంటి పరిస్థితుల మధ్య, ముగ్గురు మహిళా అభ్యర్థులతో సీనియర్ నేత భన్సల్ పోటి పడుతున్నారు. 45 శాతానికి పైగా చంఢీఘడ్ నియోజకవర్గంలో మహిళలుండటం గుల్ పనాగ్, కిరణ్ ఖేర్, జన్నత్ జహన్ లు తమ విజయంపై ఆశలు పెంచుకున్నారు. మహిళా అభ్యర్థులను ఓడించి భన్సాల్ ఐదోసారి విజయం సాధిస్తారా అనేది ఏప్రిల్ 10 తేదిన జరిగే ఎన్నికల్లో స్పష్టమవుతుంది.