శృతిహాసన్పై క్రిమినల్ చర్యలు !
హైదరాబాద్: హైదరాబాద్: ప్రముఖ సినీ నటి శృతిహాసన్పై కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒప్పందం ప్రకారం ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించకుండా తప్పుకున్నందుకు ఆమెపై క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. మరోపక్క, తదుపరి ఆదేశాలవరకు కొత్త చిత్రాలకు సంతకం చేయొద్దని, నటించొద్దని శృతిహాసన్కు ఆదేశాలు జారీచేసింది. పిక్చర్ హైజ్ మీడియా లిమిటెడ్ నటుడు నాగార్జున, తమిళనటుడు కార్తీని హీరోలుగాపెట్టి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో నటించేందుకు నిర్మాణ సంస్ధ నటి శృతిహాసన్తో ఒప్పందం కుదుర్చుకుంది. కాల్షీట్ల సర్దుబాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవలె ఆ చిత్రం తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. కానీ, అనూహ్యంగా తనకు డేట్లు కుదరడం లేదంటూ షూటింగ్కు హాజరులేనని శృతి ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపించింది. ఆమె నిర్ణయంతో తమ చిత్ర నిర్మాణానికి ఆలస్యం అవడమేకాకుండా, భారీ మొత్తంలో నష్టపోతామని, ఆమె అనైతికంగా తీసుకున్న ఈ మోసపూరిత నిర్ణయంపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఈ వ్యవహారంపై సినిమా నిర్మాణ సంస్ధ కోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు అందుకు ఆదేశిస్తూ ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఆదేశాలిచ్చింది.