Yatra Movie Review, in Telugu | ‘యాత్ర’ మూవీ రివ్యూ | YSR Biopic Review - Sakshi
Sakshi News home page

‘యాత్ర’ మూవీ రివ్యూ

Published Fri, Feb 8 2019 12:22 PM | Last Updated on Sun, Feb 10 2019 9:20 AM

YS Rajasekhara Reddy Biopic Yatra Telugu Movie Review - Sakshi

టైటిల్ : యాత్ర
జానర్ : బయోగ్రాఫికల్‌ మూవీ
తారాగణం : మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని, రావూ రమేష్‌, అనసూయ, పోసాని కృష్ణమురళి
సంగీతం : కె
దర్శకత్వం : మహి వీ రాఘవ
నిర్మాత : విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ మూవీ యాత్ర. వైఎస్‌ఆర్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు రెండున్న దశాబ్దల తరువాత మళయాల మెగాస్టార్‌ మమ్ముట్టి ఈ సినిమాతో టాలీవుడ్‌కు  రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఎన్నో విశేషాలతో తెరకెక్కిన యాత్ర ఎలా సాగింది..?

కథ‌ :
ఇది ఈవెంట్ బేస్డ్‌ బయోపిక్‌. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. ఆ యాత్ర సమయంలో వైఎస్‌ఆర్‌కు ఎదురైన అనుభవాలు. వాటి వల్ల వైఎస్‌ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులే ఈ సినిమా కథ. వైఎస్‌ జీవితంలో జరిగిన సంఘటనలు చూపిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు.. ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి.. పాదయాత్ర రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది.. యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి అన్నదే కథ.

న‌టీన‌టులు :
బయోపిక్‌ కావటంతో సినిమా అంతా ఒక్క రాజశేఖరరెడ్డి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రలో మమ్ముట్టి జీవించాడనే చెప్పాలి. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద రాజన్ననే చూస్తున్నమంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు మమ్ముట్టి. రాజశేఖరరెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. రాజారెడ్డి పాత్రలో.. కనిపించింది రెండు సన్నివేశాలే అయినా జగపతిబాబు తన మార్క్‌ చూపించారు. విజయమ్మ పాత్రలో ఆశ్రిత సరిగ్గా సరిపోయారు. లుక్‌ పరంగాను ఆమె విజయమ్మను గుర్తు చేశారు. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఆమె పాత్ర గుర్తుండి పోతుంది. మరో కీలక పాత్రలో కనిపించిన రావూ రమేష్ తనదైన నటనతో కేవీపీ పాత్రకు ప్రాణం పోశాడు. తెర మీద కనిపించింది కొద్దిసేపే అయిన అనసూయ, సుహసిని, పోసాని కృష్ణమురళిలు.. వారు పోషించిన పాత్రలకు జీవం పోశారు.

విశ్లేష‌ణ‌ :
ఇది వైఎస్‌ రాజశేఖరరెడ్డి కథ కాదు.. ఆయన వ్యక్తిత్వం. వైఎస్‌ఆర్‌ రాజకీయం ఎలా ఉంటుంది? మాటకు, నమ్మకానికి ఆయన ఇచ్చే విలువ ఏంటి? ఆయనను నమ్ముకున్న వ్యక్తులకు ఆయనకు ఎలాంటి భరోసా ఇస్తారు? పాదయాత్రకు ముందు పాదయాత్ర తరువాత వైఎస్‌ఆర్‌లో వచ్చిన మార్పు ఏంటి? ఇలా వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాలను వెండితెర మీద ఆవిష్కరించారు. తొలి సన్నివేశం నుంచే వైఎస్‌ఆర్‌ రాజకీయం ఎలా ఉంటుందో ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చూపించారు. పాదయాత్రలో ఆయన ప్రజలతో వైఎస్‌ఆర్‌ మమేకమైన తీరు, వారి కష్టాలను అవలోకనం చేసుకోవడం లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

తన ప్రత్యర్థి కూతురు ఇంటికి వచ్చి సాయం అడిగితే.. సాయం చేయద్దన్న వారితో ‘మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా’ అనే రాజన్న మాటలకు ఎవరికైనా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. హైకమాండ్ పెద్దలు వచ్చి మీ ఒక్కరితోనే మాట్లాడలన్నప్పుడు పక్కన కేవీపీ ఉన్నా.. ‘మీరు ఇప్పుడు ఒక్కరితోనే మాట్లాడుతున్నారు’ అనటం ఆయన స్నేహానికి ఎంత విలువ ఇచ్చేవారో గుర్తు చేస్తుంది. మాట ఇచ్చేముందు ఆలోచించాలి.. ఇచ్చాక చేసేదేముంది ముందుకెళ్లాల్సిందే’ అన్న మాటల్లో ఆయన విశ్వసనీయత ఎంతటిదో అర్ధమవుతుంది. ‘నేను పార్టీకి విధేయుణ్ని మాత్రమే బానిసను కాదు’ అంటూ హైకమాండ్‌ పెద్దలను ఎదిరించినప్పుడు ఆయన ధైర్యం ఎలాంటిదో అర్ధమవుతుంది. మార్కెట్‌లో ఆత్మహత్య చేసుకోబోయిన రైతుతో ‘నేను విన్నాను.. నేనున్నాను’ అన్ని సన్నివేశం ఆయనలోని నాయకుడిని జ్ఞప్తికి తెస్తుంది.

తనను నమ్ముకున్న ఓ పోలీసు కానిస్టేబుల్‌ తప్పు చేస్తే నాకేందుకులే అని విడిచిపెట్టుకుండా, తనకు చెడ్డ పేరువస్తుందేమో అని ఆలోచించకుండా తానే తగ్గి ‘నా కోసం అతని తప్పును పొరపాటుగా భావించి వదిలిపెట్టమనడం’ ఆయనది ఎంత పెద్ద మనసో చూపిస్తుంది. పాదయాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభిస్తే అశుభమన్న పేరొస్తుందేమో అన్న సబితమ్మతో ‘మంచి మనసున్న మనుషులున్నప్పుడు ముహూర్తాలతో పని ఏముంది’ అన్నప్పుడు ఓ అన్న, చెల్లికి ఇచ్చే భరోసా కనిపిస్తుంది. ఇలా ఒక్కో సన్నివేశంతో రాజన్నలోని ఒక్కో గుణాన్ని తెర మీద చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. గ్రామంలోని ఓ ఇంట్లో భోజనం చేయటం, హస్పిటల్‌లో వైఎస్‌ఆర్‌ కళ్ల ముందే ఓ చిన్నారి ప్రాణాలొదలటం, మార్కెట్‌లో ఆత్మహత్య చేసుకోబోయిన రైతుతో వైఎస్‌ఆర్‌ మాట్లాడటం లాంటి సీన్స్‌ గుండె బరువెక్కేలా చేస్తాయి.

రెగ్యులర్‌ బయోపిక్‌లా కేవలం కథ చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. ప్రతీ ప్రేక్షకుణ్ని పాదయాత్రలో భాగం చేశాడు. అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. అక్కడక్కడ పొలిటికల్‌ సెటైర్‌లు కూడా బాగా పేలాయి. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర పెద్దల ఆహార్యం, వారి డైలాగ్స్‌ సినిమాకు కామెడీ టచ్‌ ఇచ్చాయి. ఇక అప్పటి సంఘటనలకు తగ్గట్టుగా ‘బ్రీఫ్‌డ్‌ మీ’ డైలాగ్‌ను జోడించిన సన్నివేశం నవ్వులు పూయించింది.

కె అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకుడికి మరింత దగ్గర చేశాయి. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌, సత్యన్‌ సూరన్ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటాయి. సినిమాకు మరో ప్రధాన బలం సిరివెన్నెల సీతారామశాస్త్రీ అందించిన సాహిత్యం. ఆయన అందించిన పాటలు వైఎస్‌ వ్యక్తిత్వాన్ని అక్షరాల్లో ఆవిష్కరించాయి. చివర్లో వచ్చే పెంచల్‌దాస్‌ పాట ప్రతీ ప్రేక్షకుడిని కంటతడిపెట్టిస్తుంది. సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్‌లో వచ్చే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీన్స్‌ మరో ఎత్తు. అప్పటి వరకు వైఎస్‌ఆర్‌ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే రియల్‌ ఫుటేజ్‌ కదిలిస్తుంది. మరోసారి ఆ చీకటి రోజును గుర్తుచేస్తుంది. యాత్ర తెలుగు రాజకీయాలను మలుపు తిప్పిన ఓ మహత్తర ఘట్టానికి సాక్ష్యం. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం.

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement