సాక్షి, అమరావతి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి జీవితంలో మహోజ్వల ఘట్టంగా నిలిచిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ప్రజల హృదయాలను హత్తుకునేలా ఉందని వైఎస్సార్ సీపీ నాయకుడు పేర్ని నాని అన్నారు. సినిమా చూస్తున్నంతసేపు గుండె బరువెక్కిందని, భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని సిరి వెంకట్ ధియేటర్‌లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన సినిమా చూశారు. ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి.. తిరువూరు వెంకట్రామ ధియేటర్‌లో యాత్ర సినిమా వీక్షించారు.
కన్నీరు పెట్టుకున్న ద్వారంపూడి
వైఎస్సార్ సీపీ కాకినాడ నగర సమన్వయకర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా యాత్ర సినిమాను చూశారు. ఈ చిత్రం తనను కదిలించిందని ఈ సందర్భంగా చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని తలచుకుని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. (‘యాత్ర’ మూవీ రివ్యూ)
రాజన్నను కళ్లకు కట్టారు
వైఎస్ రాజశేఖరెడ్డి పాత్రను కళ్లకు కట్టినట్టుగా చూపించారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అనన్య థియేటర్‌లో కార్యకర్తలతో కలిసి యాత్ర సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజన్న రాజసం చక్కగా సినిమాలో చూపించారని ప్రశంసించారు.
బైక్ ర్యాలీల జోరు
యాత్ర సినిమా విడుదల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ సీపీ నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు, తణుకు నియోజకవర్గ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు బైక్ ర్యాలీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో కేక్ కట్ చేసి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మండవల్లి సోంబాబు, బీవీఆర్ చౌదరి, పీపీఎన్ చందర్రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
అనకాపల్లిలో...
విశాఖ జిల్లా అనకాపల్లి షిర్డీసాయి ధియేటర్‌లో యాత్ర సినిమాను వైఎస్సార్ సీపీ నాయకులు వీక్షించారు. కేక్ కట్ చేసి అభిమానులు సందడి చేశారు. మళ్ల బుల్లిబాబు, జానకిరామరాజు, జాజుల రమేష్, కొణతాల మురళి కృష్ణ, శ్రీధర్ రాజు, గొల్లవిల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment