పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ కసరత్తుతో ఉమ్మడి జిల్లాలోని పల్లెల్లో సందడి నెలకొంది. ఈ ఎన్నికల్లో మార్పులపై ఉప సంఘాన్ని ఏర్పాటు చేయడంతో కొత్త విధానాలు రానున్నాయి. ఒక పంచాయతీకి రెండుసార్లు ఒకే రిజర్వేషన్ ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తుండడంతో సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకునే ఆశావహులు ఆరాట పడుతున్నారు.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో మొత్తం 1176 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 1,170 పంచాయతీలకు సర్పంచ్‌లుండగా, 6 పంచాయతీలు ఖాళీగా ఉన్నాయి.
ఉన్న సర్పంచ్‌ల్లో మహిళలదే అగ్రభాగం..
మహిళా సర్పంచ్‌లు 619 మంది ఉండగా, పురుషులు 551 మంది ఉన్నారు. కేటగిరీల వారీగా చూస్తే అత్యధికంగా బీసీ సర్పంచ్‌లు 558 మంది ఉన్నారు. జనరల్, రిజర్వుడ్ స్థానాల్లో కూడా పోటీ చేసి విజయం సాధించడంతో బీసీ సర్పంచ్‌లు అత్యధికంగా ఉన్నారు. ఓపెన్ కేటగిరిలో అన్ని అన్ని కులాలకు చెందిన వారు సర్పంచ్‌లుగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన పంచాయతీల్లో ఆ కేటగిరికి చెందిన వారే పోటీ పడ్డారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో నూతనంగా మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మార్పుల్లో ప్రధానంగా రెండుసార్లు ఒకే రిజర్వేషన్ తెరమీదికి వచ్చింది. ఇది కొంతమంది ఆశావాహులకు సంతోషాన్ని కలిగిస్తున్నా.. మరికొంత మందికి మాత్రం రెండుసార్లా..? అంటూ ఆందోళనలో ఉన్నారు.
ఏ రిజర్వేషన్ వస్తుందోనని ..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లు, పోటీ చేయాలనుకునే ఆశావాహుల్లో ఏ పంచాయతీ ఏ కేటగిరికి రిజర్వు అవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఒక్కసారి రిజర్వు అయితే పదేళ్ల వరకు అదే కేటగిరి వ్యక్తి సర్పంచ్ కానుండడంతో మిగతా కేటగిరిల ఆశావాహులు ఈ పదవుల పందెరంపై ఆశలు వదులుకోవాల్సిందే. పదేళ్ల తర్వాత రిజర్వేషన్ మారితే తమ రాజకీయ భవిష్యత్ కలిసివస్తుందో లేదోనని హైరానా పడుతున్నారు. తమకు తెలిసిన అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా ఇప్పటికే ఏ పంచాయతీ, ఏ రిజర్వేషన్ అవుతుందోనని ఆరా తీస్తున్నారు. మరోవైపు సర్పంచ్‌లు నేరుగా కాకుండా పరోక్ష పద్ధతిన అంటే ఎన్నికైన వార్డుసభ్యుల్లో ఒకరిని ఎన్నుకునే దానిపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో ఇప్పుడున్న సర్పంచ్‌లు మళ్లీ అవకాశం వస్తుందో ...? లేదోనని ఆలోచిస్తున్నారు. సర్పంచ్ పదవిపై మోజు తగ్గని వారు వార్డు సభ్యుడిగా కూడా పోటీచేసి సర్పంచ్ పదవికి పోటీ పడేందుకు సై అంటున్నారు.
కూడికలు .. తీసివేతలు ..
మండల కేంద్రాల్లో సర్పంచ్‌లు ఎక్కడ కలిసినా ఈ ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. ‘ఈ సారి మా పంచాయతీ మళ్లీ మా కేటగిరికే రిజర్వే అవుతుందని ఒకరు.. లేదు వేరే కేటగిరి అవుతుందని మరొకరు’ ఇలా ఎవరికివారు నలుగురు కూడిన చోట కేటగిరిల కూడికలు.. తీసివేతల్లో మునుగుతున్నారు. ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎన్నికలంటే చిన్నపాటి సార్వత్రిక ఎన్నికలను తలపిస్తాయి. ఈ పంచాయతీల్లో నిధులు దండిగా ఉండడంతో ఇక్కడ ఉన్న ఆశావాహులు, సర్పంచ్‌లు తమ పంచాయతీ ఏ కేటగిరికి రిజర్వు అవుతుందోనని తమ పార్టీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి చర్చిస్తున్నారు. ప్రభుత్వం ఈసారినుంచి ఎన్నికైన సర్పంచ్‌లకు ఇప్పటికి ఉన్న వాటికి తోడు మరికొన్ని అధికారాలు కట్టబెడుతుండడంతో పల్లెల్లో ఎన్నికల కోలాహలం అప్పుడే షురూ అయింది. రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తుపై ఈ ఎన్నికలు ఉండవన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. రాజకీయ పార్టీల మద్దతుదారులుగా ఈ ఎన్నికల్లో పోటీపడే వారు బరిలో నిలుస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఏం మార్పులు తీసుకొస్తుందోనని ఉమ్మడి జిల్లాలోని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా తమ పార్టీకి పట్టుగొమ్మలైన పల్లెల్లో ఈ ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలన్న వ్యూహాలకు పదునుపెట్టనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment