ఆ పదిమందిలో ముగ్గురిని మట్టుబెట్టారు!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి కొన్నిరోజుల కిందట భారత్‌లోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదుల జాడను భద్రతా దళాలు పశ్చిమ భారతంలో గుర్తించినట్టు సమాచారం. ఆ పదిమంది ఉగ్రవాదుల్లో ముగ్గురిని గుర్తించి భద్రతా దళాలు మట్టుబెట్టాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శివరాత్రి సందర్భంగా 26/11 ముంబై దాడుల తరహాలో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంపై ఉగ్రవాద దాడికి వారు వ్యూహరచన చేశారని ఆ వర్గాలు చెప్పాయి.
పదిమంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు గుజరాత్‌లోకి ప్రవేశించారని, వారు దేశ రాజధాని న్యూఢిల్లీపై దాడి చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఢిల్లీలో తలదాచుకొని ఉంటారని ఐబీ అప్పట్లో పేర్కొంది. భారత్‌లోకి పది మంది ఉగ్రవాదులు ప్రవేశించారని పాకిస్థాన్ జాతీయ భద్రత సలహాదారు నాసిర్ ఖాన్ జాంజువా మొదట భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సమాచారమిచ్చారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు గుజరాత్‌తోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని జాంజువా తెలిపారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు, భద్రతా దళాలు ఢిల్లీ, గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో భద్రతా దళాలు పశ్చిమ భారతంలో ఆ పదిమంది ఉగ్రవాదుల జాడను కనిపెట్టి.. అందులో ముగ్గురిని హతమార్చినట్టు సమాచారమందుతున్నది.