న్యూఢిల్లీ: ‘నా బరువు 30 కిలోలు. నేను మోయాల్సిన లగేజీ కూడా దాదాపు 30 కిలోలే. అయితే, భర్త చనిపోవటంతో నా ముగ్గురు పిల్లలను బతికించుకునే భారం నాదే. అందుకే పోర్టర్‌గానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నా’ అని రాజస్తాన్‌కు చెందిన మొట్టమొదటి మహిళా రైల్వే కూలీ మంజు చెప్పిన మాటలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కదిలించాయి.
శనివారం రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన 90 మంది మొదటి మహిళల్లో జైపూర్‌కు చెందిన మంజు ఒకరు. రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన వారిలో వివిధ రంగాల్లో మొట్టమొదటి వారిగా ప్రసిద్ధులైన ఐశ్వర్యరాయ్, నికోల్ ఫారియా, బచేంద్రిపాల్, టెస్సీ థామస్, రజనీ పండిట్ తదితరులతోపాటు మొదటి మహిళా ఫైర్‌ఫైటర్, మహిళా బస్ డ్రైవర్, మహిళా మర్చంట్ నేవీ కెప్టెన్ తదితరులున్నారు. వీరందరినీ రాష్ట్రపతి సత్కరించారు.
సందర్భంగా మంజు మాట్లాడుతూ..‘పోర్టర్ ఉద్యోగంలో అడుగడుగునా అవాంతరాలే. అక్షర జ్ఞానం లేకపోవటంతో ప్లాట్‌ఫాంలు, కోచ్‌లు, సీట్ల నంబర్లను గుర్తు పెట్టుకోవటం కష్టమైపోయింది. రైల్వే అధికారుల సాయంతో ఆరునెలల్లో అంకెలను, అక్షరాలను నేర్చుకున్నా’అని తెలిపింది. వాయవ్య రైల్వే రీజియన్‌లో తొలి మహిళా కూలీగా రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. రాష్ట్రపతిని కలసిన వారిలో దివ్యాంగురాలయినప్పటికీ ఐఏఎస్‌కు ఎంపికైన ఇరా సింఘాల్ కూడా ఉన్నారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వివిధ రంగాలకు చెందిన 112 మందిని ‘మొదటి మహిళలు’గా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment