
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ (వన్ నేషన్.. వన్ ఎలక్షన్)కు సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను ఈ నివేదికలో పొందుపరిచారు.
కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ 18,626 పేజీల ఈ నివేదికను రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 2023, సెప్టెంబర్ 2 ఈ నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. పలువురు నిపుణుల సారధ్యంలో 191 రోజుల కసరత్తు అనంతరం ఈ నివేదికను పూర్తిచేశారు. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, తరువాతి 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ఈ నివేదికలో సిఫారసు చేసింది.
‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ నివేదికలోని ముఖ్యాంశాలు
- కోవింద్ కమిటీ తన నివేదికలో ఏకకాలంలో ఓటు వేయడం దేశప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది.
- ఒకేసారి ఐక్యంగా ఓటు వేయడం అనేది అభివృద్ధి ప్రక్రియను, సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తుంది.
- ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుంది.
- ఏకకాలంలో ఓటింగ్ జరగడం వల్ల పారదర్శకత, సౌలభ్యం, ఓటరు విశ్వాసం గణనీయంగా పెరుగుతుందని కోవింద్ కమిటీ భావించింది.
- ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది, భద్రతా దళాల ముందస్తు ప్రణాళికను ఈ కమిటీ సిఫారసు చేసింది.
- తొలిసారిగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఉండవచ్చని నివేదిక పేర్కొంది.
- హంగ్ హౌస్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగితే, మిగిలిన ఐదేళ్ల కాలానికి తాజా ఎన్నికలు నిర్వహించవచ్చని కోవింద్ కమిటీ పేర్కొంది.