ఢిల్లీకి సీఎం కేసీఆర్
రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారానికి హాజరు
ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ!.. 27న తిరుగు పయనం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. సోమవారం రాత్రి 9 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన సీఎం.. రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరగనున్న రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్, కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతితో సీఎం భేటీ అయ్యే అవకాశాలు న్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఈ సందర్భంగా ప్రధానిని సీఎం కోరనున్నారు. అలాగే ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద ఉన్న పదకొండు ప్రాజెక్టుల్లో వరద కాల్వ, దేవాదుల, భీమా ప్రాజెక్టులకు రూ.5,490 కోట్లు మంజూరు చేయాలని విన్నవించనున్నారు.
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు కేటాయించాలంటూ గతంలో నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులనూ మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. గ్రానైట్, బీడీ, చేనేత పరిశ్రమల ఉత్పత్తులపై జీఎస్‌టీని సడలించాలని, ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని కోరనున్నారు. విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రధానికి సీఎం విన్నవించనున్నారు. వెనకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన మూడో విడత రూ.450 కోట్ల ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలని, సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ అప్పగింతను వేగవంతం చేయాలని కోరనున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడును కలసి సీఎం శుభాకాంక్షలు తెలుపనున్నారు. అలాగే పదవీ కాలం ముగియనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆయనకు కేటాయించిన ప్రత్యేక నివాసంలో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. కాగా, ఇప్పటికే ఖరా రైన షెడ్యూలు ప్రకారం ఈ నెల 27న ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
గవర్నర్ ఢిల్లీ పర్యటన
రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరవుతారు.