భారత శాస్త్రవేత్తకు 14 కోట్ల గ్రాంటు
మంజూరు చేసిన సింగపూర్ ఎన్‌ఆర్‌ఎఫ్
న్యూఢిల్లీ: భారత పరిశోధకుడు డాక్టర్ మన్వేంద్ర కె సింగ్‌కు సింగపూర్ జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఆర్‌ఎఫ్) రూ. 14.7 కోట్ల గ్రాంటును బహూకరించింది. పుట్టుకతో సహజసిద్ధంగా వచ్చే వ్యాధులు, హృద్రోగ సమస్యలపై పరిశోధనలు చేసేందుకు ఆయనకు దీన్ని మంజూరు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది సింగపూర్ ఎన్‌ఆర్‌ఎఫ్ ఫెలోషిప్ అందుకున్న ఏడుగురిలో తాను ఒకరినని మన్వేంద్ర చెప్పారు.
2014లో సింగపూర్‌లో జరిగిన మరణాల్లో దాదాపు 30 శాతం హృద్రోగ సంబంధమైనవని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన మన్వేంద్ర ప్రస్తుతం సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్‌లో, నేషనల్ హార్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.