శాసన సభలో ముఖ్యమంత్రి
15 సంఘటనల్లో 89 మంది అరెస్టు
భువనేశ్వర్ : రాష్ట్రంలో ఇటీవల కాలంలో మంత్రులు నాయకులపై గుడ్లు రువ్వి దాడులకు పాల్పడుతున్న సంఘటనలు తరచూ సంభవిస్తున్నాయి. ప్రధానంగా ఈ దాడులు అధికార బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీ వర్గాల మధ్య జరిగిన విషయం విదితమే. రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కేంద్ర మంత్రులు కూడా గుడ్ల దాడికి గుర య్యారు. ఈ విచారకర పరిస్థితుల పట్ల సభలో వివరాలు ప్రవేశ పెట్టాలనే సభ్యుల అభ్యర్థన మేరకు హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఇటీవల కాలంలో గుడ్ల దాడులకు పాల్పడిన సంఘటనలు 15 జరిగాయి.
⇔ వాటిలో 89 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు సీఎం వివరించారు. 3 సంఘటనల్లో భారతీయ జనతా పార్టీ మంత్రులు, ప్రముఖులు గురికాగా మిగిలిన సంఘటనల్లో బిజూ జనతా దళ్ వర్గాలే బలైనట్లు ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన వివరణలో సూటిగా పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, రౌర్కెలా నియోజకవర్గం ఎమ్మెల్యే దిలీప్ రే ప్రశ్నకు బదులుగా శాసన సభలో ఈ వివరాలు బయటకు వచ్చాయి.
బయటకు రాని బీజేడీ ఎంపీపై దాడి వివరాలు
అయితే వీటిలో కేంద్రాపడ లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడు, బిజూ జనతా దళ్ అభ్యర్థి బైజయంత్ పండాపై జరిగిన దాడికి సంబంధించి చర్యలు ఈ జాబితాలో లేనట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనితో బైజయంత్ పండాపై జరిగిన దాడిపట్ల చర్యల్ని హోమ్ శాఖ మినహాయించినట్లు సభలో పరోక్షంగా అంగీకరించినట్లేనని బిజూ జనతా దళ్ మినహా ఇతర పక్షాల్లో చర్చ బలం పుంజుకుంది. బైజయంత్ పండాపై జరిగిన దాడిలో అధికార పక్షం బిజూ జనతా దళ్ హస్తం పరోక్షంగా ఉన్నందున బయటపడనీయకుండా ఈ మేరకు మినహాయింపు కల్పించారని ప్రత్యర్థి వర్గాలు బాహాటంగా ఆరోపిస్తున్నాయి.
దాడి సంస్కృతిని నివారించాలి
2015 నుంచి నాయకుల పర్యటన పురస్కరించుకుని ప్రత్యర్థులు గుడ్లు రువ్వి అవమానపరిచే సంస్కృతికి బీజం పడింది. 2015వ సంవత్సరంలో 2 సార్లు వేర్వేరు సందర్భాల్లో ఇటువంటి విచారకర దాడులు జరిగాయి. 2015వ సంవత్సరం ఫిబ్రవరి నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కారు పైకి గుడ్లు రువ్విన సంఘటనలో 18 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. 2015వ సంవత్సరం నవంబరు నెల 5వ తేదీన మంత్రి ప్రదీప్ మహారథి వాహనంపై ఇటువంటి దాడి నేపథ్యంలో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. 2016వ సంవత్సరంలో అత్యధికంగా రాష్ట్రంలో 13 సార్లు గుడ్లతో దాడులు జరిగాయి. ఇలా ఈ అవాంఛనీయ నిరసన ప్రదర్శన సంస్కృతి క్రమంగా పుంజుకుంటోంది. దీనిని నివారించాల్సిన బాధ్యత పట్ల కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన పరిస్థితుల నడుమ మధ్య శాంతి భద్రతల నిర్వహణ ప్రక్రియను పటిష్టపరచడం అనివార్యమని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.