
'పాన్ మసాలా' కోసం ప్రాణం తీశాడు!
అహ్మదాబాద్: పాన్ మసాలా కోసం జరిగిన ఘర్షణలో ఓ నిండు ప్రాణం బలైంది. పాన్ మసాలా అడిగితే ఇవ్వలేదంటూ స్నేహితుడి ప్రాణాలు తీసిన ఘటన అహ్మదాబాద్‌లోని నరోడా టౌన్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెహాల్ పటేల్ (19) అనే యవకుడు జైఅంబే అపార్ట్‌మెంట్ లో నివాసముంటున్నాడు. కుర్ణాల్ పాటిల్ (19) అనే యువకుడు కూడా అదే ప్రాంతానికి చెందిన కాలనీలో నివాసముంటున్నాడు. గత రాత్రి 3 గంటల ప్రాంతంలో స్నేహితులతో పాటు ఉన్న పాటిల్ వద్దకు నెహాల్ వచ్చి మాట కలిపాడు. తనకు పాస్ మసాలా కావాలని పాటిల్‌ను అడిగాడు.
అయితే తాను ఇవ్వకపోవడంతో వారి ఇరువురి మధ్య చిన్న వైరం చోటుచేసుకుంది. విచక్షణ కోల్పోయిన నెహాల్.. ఆక్రోశంతో తన స్నేహితుడు పాటిల్‌ను కత్తితో పొడిచాడు. దాంతో తీవ్ర రక్తస్రావమై పాటిల్ అక్కడిక్కడే మృతిచెందాడు. ఇరువురి స్నేహితుడైన మహేంద్ర పటేల్ అనే యవకుడు సమీపంలోని కృష్ణా నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు నిందితుడు నెహాల్‌ను అరెస్ట్ చేసి, కత్తిని స్వాధీనం చేసుకున్నట్టు ఇన్‌స్పెక్టర్ సీఆర్ సంగాడా వెల్లడించారు.