
స్వర్ణదేవాలయంలో కత్తులతో ఘర్షణ
అమృత్సర్ : ఆపరేషన్ బ్లూస్టార్ 30వ వార్షికోత్సవం సందర్భంగా అమృత్‌సర్‌లో జరిగిన నివాళి కార్యక్రమంలో రెండు సిక్కు గ్రూపుల మధ్య జరిగిన దాడులు శుక్రవారం ఉద్రిక్త వాతావరణానికి దారి తీశాయి. అమృత్‌సర్‌లోని ప్రఖ్యాత స్వర్ణదేవాలయంలోనే ఏకంగా కత్తులతో దాడులు చేసుకోవడంతో 12 మందికి గాయాలయ్యాయి. సిక్ రాడికల్ గ్రూపు, శిరోమణి గురుద్వారా ప్రబంధ్ కమిటీ మధ్య జరిగిన గొడవలు ఉద్రిక్తతకు దారి తీశాయి.
1984 జూన్ నెలలోజరిగిన ఆపరేషన్ బ్లూస్టార్పై ఐక్యరాజ్యసమితితో విచారణ జరిపించాలని రాడికల్ గ్రూపు డిమాండ్ చేస్తోంది. అకాలీదళ్ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. నివాళి అర్పిస్తున్న సమయంలోనే రాడికల్ గ్రూపు సభ్యులు ఐక్యరాజ్య సమితి విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. అయితే, ఇలాంటి అంతర్జాతీయ పెత్తనాన్ని అంగీకరించకూడదని విశ్లేషకులు అంటున్నారు. ఆపరేషన్ బ్లూస్లార్ అనేది ఎప్పుడో గడిచిపోయిన విషయమని, పంజాబ్లో ఎన్నాళ్లుగానో పాతుకుపోయిన అకాలీదళ్ ఇప్పుడు బలహీనపడుతుంటే.. కొత్త శక్తులు బయటకు వస్తున్నాయని అంటున్నారు. ఉగ్రవాదానికి స్థావరాలుగా మారుతున్న కొత్తగ్రూపులను మాత్రం ఎప్పటికప్పుడు అణచివేయకపోతే భింద్రన్వాలే వారసులు మళ్లీ పుట్టుకొచ్చే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. స్వర్ణ దేవాలయం శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) ఆధీనంలో ఉండగా, పోలీసులు అక్కడి శాంతి భద్రతల అంశాన్ని పట్టించుకోడానికి మీనమేషాలు లెక్కపెట్టడం కూడా ఈ తరహా ఘర్షణలకు కారణం కావచ్చని అంటున్నారు.