స్కూల్ బస్సు ప్రమాదం: 25 మందికి గాయాలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఓ స్కూలు బస్సు అదుపుతప్పి గుంతలో పడింది. ఈ ఘటనలో 25 మంది పిల్లలు గాయాలపాలయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. సుందర్‌నగర్ సబ్‌డివిజన్ పరిధి దేహర్‌లోని వివేకానంద పబ్లిక్ స్కూలుకు చెందిన బస్సు సంలోగ్ గ్రామం వైపు నుంచి ఉదయం విద్యార్థులతో బయలుదేరింది. మార్గమధ్యంలో ముందున్న బస్సును ఓవర్ టేక్ చేసేందుకు డ్రైవర్ యత్నించగా అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడి బస్సు పైభాగం రెండుగా చీలిపోయింది.
దీంతో సమీపంలోని గ్రామస్తులు అక్కడికి చేరుకుని పిల్లలందరినీ బయటకు తీశారు. గాయపడిన చిన్నారులను సుందర్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారకి ఉచిత వైద్య చికిత్సతోపాటు తీవ్రంగా గాయపడిన ఆరుగురు చిన్నారులకు రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం సాయం ప్రకటించింది. అయితే, విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు.