ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌లో కాపలా లేని రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగిన ఘోర ప్రమాదం పసిపిల్లల ప్రాణాలు బలిగొనడంతో ఈ పాపం ఎవ్వరిదన్న చర్చ మరోసారి జరుగుతోంది. 2018 మార్చి 31 నాటికి దేశంలో 3,479 కాపలా లేని రైల్వే క్రాసింగ్లు ఉన్నాయి. ఈ క్రాసింగ్‌లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి స్థానంలో ఉంటే యూపీ రెండో స్థానంలోఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 1357 కాపలా లేని క్రాసింగ్‌లు ఉన్నాయి. దేశంలో ఇలాంటి క్రాసింగ్‌లను 2020 సంవత్సరంలోగా పూర్తిగా తొలగించాలని రైల్వే శాఖ డెడ్‌లైన్ విధించుకుంది. వచ్చే రెండేళ్లలో వీటి దగ్గర గేట్లు ఏర్పాటు చేసి కాపలాదారుల్ని నియమించడం, లేదంటే రోడ్ ఓవర్ బ్రిడ్జి , రోడ్ అండర్ వంతెనలు నిర్మించడానికి రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ లోగా రైల్వే క్రాసింగ్‌ల దగ్గర ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ జరిగే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రమాదాల నివారణకు గేట్ మిత్ర
2014–15 సంవత్సరంలో కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల దగ్గర ఏకంగా 50 ప్రమాదాలు జరిగి 130 మంది నిండు ప్రాణాలు బలయ్యాయి. అప్పట్నుంచి రైల్వే శాఖ ఈ క్రాసింగ్‌ల దగ్గర ప్రమాదాలను నివారించడానికి గేట్ మిత్ర అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వాలంటీర్లను నియమించింది. రైలు వచ్చినప్పుడల్లా ట్రాక్‌లను దాటే వాహనదారుల్ని, పాదచారుల్ని అప్రమత్తం చేయడమే వీరి పని. అయితే ఈ వాలంటీర్లకు తగిన సదుపాయాలు కల్పించడంలో రైల్వే శాఖ విఫలమవడంతో వారి పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. అయితే కాపలా లేని క్రాసింగ్‌లు తొలగించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంది. కాపలా లేని క్రాసింగ్‌ల దగ్గర వచ్చి పోయే వాహనాల సంఖ్య ఆధారంగా వాటిని అయిదు రకాలుగా విభజించింది.
ప్రతీ గంటలో ఆ ట్రాక్ మీదుగా ఎన్ని రైళ్లు వెళతాయి, అదే సమయంలో ఎన్ని వాహనాలు వెళతాయి అన్న లెక్కలతో ట్రైన్ వెహికల్స్ యూనిట్స్‌ని (టీయూవీ) అంచనా వేసింది. టీయూవీలు 10 వేలు దాటితే కేటగిరీ ఒకటి కిందకి వస్తాయి. అంటే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాటిని ముందుగా తొలగించే కార్యక్రమాలు చేపట్టింది. అలా గత ఏడాది రైల్వే శాఖ 1464 కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లను తొలగించింది. ఈ చర్యల వల్ల 2016–17 ప్రమాదాల సంఖ్య బాగా తగ్గింది. ఆ ఏడాది జరిగిన ప్రమాదాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన కుషీనగర్ టీయూవీ లెక్కల్లో చూస్తే 2 వేల కంటే తక్కువే.. అంటే కేటగిరీ అయిదు కిందకే వస్తుంది. అయినా ప్రమాదం జరిగిందంటే డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రైల్వే శాఖ ఆరోపిస్తోంది.
చట్టం ఏం చెబుతోంది ?
వాస్తవానికి కాపలా లేని చోట రైల్వే పట్టాలు దాటినప్పుడు వాహనదారులు, పాదచారులే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని, రైలు వస్తోందా లేదా అని ఒకటికి రెండు సార్లు గమనించుకొని అప్పుడే దాటాలని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహాని అంటున్నారు. రైల్వే క్రాసింగ్‌ల దగ్గర వాహనదారుల్ని జవాబుదారీలుగా చేస్తూనే మన చట్టాలు కూడా రూపొందాయి. మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 131 ప్రకారం, భారత రైల్వే చట్టం సెక్షన్ 161 ప్రకారం కాపలా లేని క్రాసింగ్‌లను దాటేటప్పుడు జరిగే కష్టనష్టాల బాధ్యత వాహనదారులే భరించాల్సి ఉంటుంది. రైల్వే శాఖ ప్రయత్నాలు ఎలా ఉన్నా రైల్వే క్రాసింగ్‌ల దగ్గర వాహనదారులే జాగ్రత్తగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
-- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment