లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుపాను బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 26 మంది మృతి చెందగా, 57 మంది గాయపడ్డారు. తుపాను ధాటికి ఇంటి గోడలు కూలిపోగా, చెట్లు నేలకొరిగాయి. దీంతో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. మైన్‌పురిలో పలు చోట్ల గోడ కూలిన ఘటనలో అత్యధికంగా ఆరుగురు మృతి చెందారని విపత్తు కమిషనర్ తెలిపారు. అలాగే మైన్‌పురి జిల్లాలో 41 మంది గాయపడ్డారని, చెట్లు కూకటి వేళ్లతో సహా రహదారికి అడ్డంగా పడటంతో చాలా సేపటి వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పారు.
ఆ సమయంలో ప్రజలు వారి ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని, దీంతో ఇంటి గోడలు కూలి చాలావరకు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. ‘ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం దుమ్ము తుపాను కారణంగా మైన్‌పురిలో ఆరుగురు, ఎటా, కాస్గంజ్‌ల్లో ముగ్గురు, ఫరూఖాబాద్, బారాబంకిల్లో ఇద్దరు, మొరాదాబాద్, బదౌన్, పిలిభిత్, మధుర, కనౌజ్, సంభాల్, ఘజియాబాద్, అమ్రోహ, బదౌన్, మహోబాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు’అని కమిషనర్ పేర్కొన్నారు. కాగా, తాజా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తుపాను బాధితులకు సాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment