28-4-67.. ఇదీ ఆప్ ప్రస్థానం
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్.. కోట్లాది అభిమానులున్న సినీ హీరో కాదు. రాజకీయ వారసుడు అంతకన్నా కాదు. అతనో సామాన్యుడు. ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి అవినీతికి వ్యతిరేకంగా పోరుబాటపట్టారు. అన్నా బృందంతో పనిచేసి ఆనక రాజకీయాల్లోకి వచ్చారు. సామాన్యుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి రాజకీయ నాయకుడిగా మారారు. ప్రజాభిమానంతో నేడు అసమాన్యుడిగా, ప్రజాదరణ గల నేతగా ఈ ఢిల్లీ వాలా ఎదిగారు.
కేజ్రీవాల్ 2012 నవంబర్ 26న ఆప్ను స్థాపించారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సంచలనం సృష్టించింది. 70 సీట్లున్న ఢిల్లీలో అసెంబ్లీలో 28 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ మద్దతులో 2013 డిసెంబర్ 28న కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే కేవలం 49 రోజులే ముఖ్యమంత్రిగా పనిచేశారు. జన లోక్పాల్ బిల్లు విషయంలో కాంగ్రెస్తో విభేదించి కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేశారు.
గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఆప్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే 434 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆప్ పంజాబ్ లో 4 చోట్ల విజయం సాధించింది. ఆ తర్వాత కేజ్రీవాల్పై విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆయన నియంతృత్వ పోకడలు అవలంభిస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. సహచరులు కూడా కొందరు పార్టీని వీడారు. కేజ్రీవాల్ ఛరిస్మా తగ్గిందని భావించారు. అయినా కేజ్రీవాల్ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ముందుండి పార్టీని నడిపించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ను ఎదుర్కొనేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. బీజేపీ తరపున కేంద్రమంత్రులు, 120 మంది ఎంపీలు ప్రచారం చేశారు. ఆప్ తరపున మాత్రం కేజ్రీవాల్ అన్నీతానై నడిపించారు. ఢిల్లీ ప్రజలు ఆప్ను, కేజ్రీవాల్ను విశ్వసించారు. ఎవరూ ఊహించని ఘనవిజయం అందించారు. గతంలో 28 సీట్లు గెల్చుకున్న ఆప్ తాజా ఎన్నికల్లో 67 స్థానాల్లో విజయం సాధించింది. తాజా విజయంతో భారత రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించింది.