సర్వేలకు అందని అ'సామాన్య' విజయం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు తొలుత హోరాహోరీ తలపించింది. ఆమ్ ఆద్మీ పార్టీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. ఆ తర్వాత ఆప్ది కాదు బీజేపీదే విజయమని మరికొన్ని సర్వేలు తేల్చాయి. ఎన్నికల ముగిసిన అనంతరం అన్ని సర్వేలు ఆప్కే పట్టం కట్టాయి. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తుందని ముక్తకంఠంతో చెప్పాయి
బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలు పేర్కొన్నాయి.
అయితే ఆప్ ఇంతటి ఘనవిజయం సాధిస్తుందని సర్వేలు, రాజకీయ పండితులు సైతం ఊహించలేకపోయారు. బీజేపీకి ప్రతిపక్ష స్థానం కూడా రాదని అంచనా వేయలేకపోయారు. ఆప్ది సర్వేలకు సైతం అందని అసమాన్య విజయం. కేజ్రీవాల్ ఛరిస్మా ముందు మోదీ హవా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం, కిరణ్ బేడీ నేపథ్యం.. ఏవీ పనిచేయలేకపోయాయి. ఢిల్లీ ఎన్నికల చరిత్రలోనే ఆప్ సంచలన విజయం సాధించింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 67 చోట్ల విజయం సాధించింది. బీజేపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోగా కాంగ్రెస్ బోణీ కూడా కొట్టలేకపోయింది. ఆప్ విజయం.. అరవింద్ కేజ్రీవాల్, సామాన్యుడి విజయం.
ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనా
ఇండియా టుడే-సిసిరో సర్వే: ఆప్ 35-43; బీజేపీ 23-29; కాంగ్రెస్ 3-5
టైమ్స్ నౌ- సీఓటర్ సర్వే: ఆప్ 31-39; బీజేపీ 27-35; కాంగ్రెస్ 2-4
ఎన్డీటీవీ సర్వే: ఆప్ -38; బీజేపీ 28; కాంగ్రెస్ 4
ఏబీపీ నీల్సన్ సర్వే: ఆప్ 39; బీజేపీ 28; కాంగ్రెస్ 3
న్యూస్ నేషన్ సర్వే: ఆప్ 39-43; బీజేపీ 25-29; కాంగ్రెస్ 1-3