దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ వెంటే నడుస్తారని, ఆ పార్టీకే ఓటు వేస్తారని సామాజిక విశ్లేషకులు ముందుగానే భావించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని బీద బిక్కీ, బడుగువర్గాలు, కార్మికులు, కర్షకులతోపాటు దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ వెంటే నడుస్తారని, ఆ పార్టీకే ఓటు వేస్తారని సామాజిక విశ్లేషకులు ముందుగానే భావించారు. ఇక మధ్యతరగతి ప్రజలు, సంపన్న వర్గాలు సంప్రదాయంగా భారతీయ జనతా పార్టీకే మద్దతిస్తాయని సామాజిక విశ్లేషకులతోపాటు రాజకీయ వర్గాలు భావించాయి. ఫలితాల సరళిని విశ్లేషిస్తే దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బడుగువర్గాలతోపాటు మధ్యతరగతి ప్రజలు కూడా ఆమ్‌ఆద్మీ పార్టీకే బ్రహ్మరథం పట్టాయి. సంపన్న వర్గాల్లో మాత్రమే కొద్దిగా బీజేపీ పైచేయి కనబర్చింది.
మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దర్యా గంజ్, జనక్‌పురి, కరోల్ బాగ్, చాందినీ చౌక్, పజర్‌గంజ్, మోతీనగర్ ప్రాంతాలు ఆప్‌కు బ్రహ్మరథం పట్టాయి. ఈ ప్రాంతాల్లో ఆప్ అభ్యర్థులకు 60 శాతంపైగా ఓట్లు పడ్డట్టు విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. గత మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లోనే బీజేపీకి ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈసారి కూడా ప్రధాని మోదీ సుస్థిర పాలన నినాదాన్ని నమ్మి తమకే ఓటు వేస్తారని బీజెపీ వర్గాలు భావించి భంగపడ్డాయి. ఈసారి ఎన్నికల ఫలితాల్లో మరో ఆశ్చర్య కోణం బయటపడింది. సంప్రదాయబద్ఢంగా బీజెపీ మద్దతుదారులైన వ్యాపార వర్గం కూడా ఆప్ వెంటే నడిచింది. దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దిల్షాద్ కాలనీ, బీఆర్ బెద్కర్ నగర్ కాలనీ, గోవింద్ పురి లాంటి ప్రాంతాల్లో ఓటర్లు ఊహించినదానికన్నా ఎక్కువే ఆప్‌కు మద్దతిచ్చారు. ఇక సంపన్న వర్గాలు నివసించే ఫ్రెండ్స్ కాలనీ, వసంత్ విహార్, గోల్ఫ్ లింక్స్, డిఫెన్స్ కాలనీ, గ్రేటర్ కైలాష్, హౌజ్‌ఖాస్, వసంత్ కుంజ్, లజ్‌పత్ నగర్, పంజాబీబాగ్ ప్రాంతాల్లో బీజెపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి.
ఢిల్లీలో పార్టీల వారీగా మొత్తం ఓటింగ్ శాతం
ఆప్: 54.3 శాతం.. 67 సీట్లు
బీజేపీ: 32.2 శాతం.. 3 సీట్లు
కాంగ్రెస్: 9.7 శాతం
బీఎస్పీ: 1.3 శాతం
ఐఎన్ఎల్డీ: 0.6 శాతం
ఐఎన్డీ: 0.5 శాతం
ఎస్ఏడీ: 0.5 శాతం
నోటా: 0.4 శాతం