
సైనిక శిబిరంపై ఉగ్ర దాడి
కెప్టెన్‌తోసహా ముగ్గురు సైనికుల మృతి
- మృతుల్లో విశాఖ వాసి
- ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మళ్లీ రక్తమోడింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు మాటు వేసి దుశ్చర్యకు తెగబడ్డారు. ఉగ్రమూకలు చేసిన ఈ దాడిలో భారత భద్రత దళానికి చెందిన ముగ్గురు సైనికులు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు కుప్వారా జిల్లాలోని పంజగం సైనిక శిబిరంలోకి నలుపు రంగు దుస్తుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చాటుగా చొరబడి సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కెప్టెన్ ఆయుష్ యాదవ్‌తో సహా ఇద్దరు సైనికులు అక్కడికక్కడే నేలకొరిగారు. నియంత్రణ రేఖ నుంచి కేవలం పదికిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సైనిక శిబిరంలోని ఉగ్రవాదులు రెండో భద్రతా వలయాన్ని ఛేదించుకుని మరీ లోపలికి రాగలిగారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి.
సైనిక శిబిరానికి ప్రధాన గేటు వద్దే ఉగ్రవాదుల్ని లోపలికి ప్రవేశించకుండా భద్రతా బలగాలు నిలువరించాయి. గాయపడిన మూడో ఉగ్రవాదిని కూడా పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హతమైన ఉగ్రవాదులు నిషేధిత జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారుగా అధికారులు అనుమానిస్తున్నారు. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య సుమారు 35 నిమిషాల సేపు భీకరమైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల అనంతరం భద్రతా బలగాల మీదికి కొన్ని అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. దీంతో సైనికులు వారిపైకి కాల్పులు జరపగా 75 ఏళ్ల వ్యక్తి ఒకరు మృతి చెందాడు.
కెప్టెన్ ఆయుష్ యాదవ్, సుబేదర్ భూప్ సింగ్ గుజ్జర్, నాయక్ బి వెంకటరమణలు ఉగ్రదాడుల్లో మృతిచెందారు. ఉత్తర ప్రదేశ్‌లోకి కాన్పూర్‌కు చెందిన కెప్టెన్ ఆయుష్ యాదవ్ మూడేళ్ల క్రితమే సైన్యంలో చేరారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్టణంకు చెందిన నాయక్ బీ వెంకట రమణ గత 18 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నారు. ఇక సుబేదర్ గుజ్జర్ గత 26 ఏళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నారని న్యూఢిల్లీలోని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఉగ్రదాడిలో గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం 92 ఆర్మీ బేస్ ఆస్పత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు.
18 ఏళ్లుగా ఆర్మీలో...
విశాఖ నగర పరిధిలోని ఆసవానిపాలేనికి చెందిన బీవీ వెంకటరమణ (38) పద్దెనిమిదేళ్లుగా ఆర్మీలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ‘నాయక్’ హోదాలో ఉన్నారు. ఆయనకు భార్య అనిత, కూతురు (8), కొడుకు (6), తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. వారిలో పెద్ద తమ్ముడు అప్పలరాజు కూడా ఆర్మీలోనే ఉన్నారు. వెంకటరమణ ప్రాణాలు విడిచారు. బుధవారం సాయంత్రమే కుటుంబ సభ్యులతో ఫోన్‌లో చివరిసారిగా మాట్లాడిన రమణ.. రిలీవింగ్ ఉత్తర్వులు రాగానే ఇంటికొస్తానని చెప్పారు. అంతలోనే ఆయన మరణించడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.