జైలు లేదు జరిమానాయే
► గడువు తర్వాత పాతనోట్లున్న వారిపై కేంద్రం నిర్ణయం
► రూ.10వేల జరిమానా మాత్రమేనంటూ ఆర్డినెన్సులో మార్పు
న్యూఢిల్లీ: రద్దయిన రూ.500, వెయ్యి నోట్లను పదికి మించి కలిగున్న వారికి రూ.10వేల వరకు జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది. దీన్నుద్దేశించి చేసిన ఆర్డినెన్సులో ఉన్నట్లుగా నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ‘ద స్పెసిఫైడ్ బ్యాంక్‌నోట్స్ సెస్సేషన్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్డినెన్సు’కు బుధవారమే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ జైలు శిక్ష విధించాలన్న నిబంధనను గురువారం తొలగించింది. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్న ఆ ఆర్డినెన్సు డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం మార్చి 31 తర్వాత పాతనోట్లను కలిగున్నవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవటంతోపాటు రూ.10వేల జరిమానా లేదా పట్టుకున్న ధనానికి ఐదురెట్ల జరిమానా విధించనున్నారు. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక కౌంటర్లలో పాతనోట్లను డిపాజిట్ చేస్తున్నప్పుడు డిక్లరేషన్ లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే.. రూ.5వేల జరిమానా లేదా డిపాజిట్ చేసిన మొత్తానికి ఐదురెట్లు (ఏది ఎక్కువైతే అది) వసూలు చేస్తారు. అయితే రీసెర్చ్ స్కాలర్స్ 25 నోట్ల వరకు తమ దగ్గర పెట్టుకునేందుకు ఈ ఆర్డినెన్సు అనుమతిచ్చింది
కారణం లేకుంటే భారీ జరిమానా
బ్యాంకులకు చేరని రద్దయిన నోట్లను చెల్లకుండా చేసేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ సవరణకు కూడా ఈ ఆర్డినెన్సు చట్టపరమైన మద్దతిస్తుంది. ఈ ఆర్డినెన్సు ఆరునెలల్లో పార్లమెంటు ఆమోదంతో చట్టంగా మారాల్సి ఉంటుంది. 1978లోనూ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దుచేస్తున్నట్లు ఆర్డినెన్సు జారీ చేసింది. అయితే ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం రూ.15.4 లక్షల కోట్ల కరెన్సీ (రద్దయిన నోట్లు)కి బదులుగా.. రూ. 14 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్/మార్పిడి అయినట్లు తెలిసింది.
నోట్ల మార్పిడికి నేడే ఆఖరు
నవంబర్ 8 నిర్ణయం తర్వాత రద్దయిన నోట్లను మార్చుకునేందుకు కేంద్రం విధించిన గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు నోట్లను బదిలీ చేసుకోని వారు సరైన ఆధారాలను జతపరుస్తూ ఎంపిక చేసిన ఆర్బీఐ కౌంటర్లలో మార్చి 31 వరకు నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు, మిలటరీలో పనిచేసేవారు సరైన కారణాలను చూపిమాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కాగా, నోటుపై సూచించిన సంఖ్యకు సమాన మొత్తాన్ని చెల్లిస్తామంటూ నోటుపై ఉండే హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి తమవద్దనున్న నోట్లను తిరిగి ఇచ్చేందుకు సరైన సమయం ఇచ్చి.. గడువు పూర్తయ్యాక వాటిని రద్దు చేసేందుకు చట్టం చేయాల్సి ఉంటుంది. ∙నోట్ల మార్పిడికి నేటివరకు గడువుంది.