
ఆస్తులు వెల్లడించని పల్లంరాజు, పురందేశ్వరి
న్యూఢిల్లీ: గడువు ముగిసి నెలరోజులు దాటిపోయినా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎం.ఎం.పల్లంరాజు, డి.పురందేశ్వరి తమ ఆస్తుల వివరాలను ప్రకటించలేదు. మంత్రులకు సంబంధించిన నియమావళి మేరకు కేంద్ర మంత్రులైతే ప్రధానమంత్రికి, రాష్ట్ర మంత్రులైతే ముఖ్యమంత్రికి ఏటా తమ ఆస్తులు, అప్పుల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన గడువు గత ఆగస్టు 31తో ముగిసిపోయింది. అయినా మంగళవారం వరకు మొత్తం 77 మంది కేంద్ర మంత్రుల్లో 35 మంది తమ ఆస్తులు, అప్పులకు సంబంధించిన వార్షిక వివరాలను ప్రధానికి అందజేయడంలో విఫలమయ్యారు. 32 మంది కేబినెట్ మంత్రుల్లో పల్లంరాజు సహా 18 మంది, 12 మంది స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రుల్లో ఏడుగురు, 33 మంది సహాయ మంత్రుల్లో పురందేశ్వరి సహా 17 మంది తమ ఆస్తుల వివరాలను దాఖలు చేయలేదు.
కేబినెట్ మంత్రులు గులాం నబీ ఆజాద్, అజిత్ సింగ్, క పిల్ సిబల్, శ్రీప్రకాశ్ జైశ్వాల్, సహాయ మంత్రులు శశిథరూర్, ఆర్పీఎన్ సింగ్ తదితరులులు తమ ఆస్తుల వివరాలు ప్రకటించలేదు. అయితే ఎ.కె.ఆంటోని, పి.చిదంబరం, శరద్‌పవార్, సుశీల్‌కుమార్ షిండే, వీరప్పమొయిలీతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు ఆస్తులను వెల్లడించిన వారిలో ఉన్నారు.