-పది మందికి తీవ్రగాయాలు
-వేలూరు జిల్లాలో ఘటన
వేలూరు(తమిళనాడు): తమిళనాడు వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని బాణసంచా గోడౌన్‌లో టపాకాయలు పేలి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గుడియాత్తం సమీపంలోని కల్లపాడి గ్రామంలో ప్రభుత్వ అనుమతితో బాణసంచా గోడౌన్‌ను అదే ప్రాంతానికి చెందిన సంపత్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గోడౌన్‌లో పెద్ద పేలుడు సంభవించింది. అక్కడ నిల్వ ఉంచిన టపాకాయలు పేలి భవనం పూర్తిగా నేలమట్టమైంది. శబ్దం విని స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నేల మట్టమైన భవన శిథిలాల మధ్య చిక్కుకున్న క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు.
అప్పటికే రామాల గ్రామానికి చెందిన సర్వశరన్(35), జయశంకర్(35), జీవిత(25) మృతి చెందారు. తీవ్రగాయాలైన పది మంది కార్మికులను పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మేఘల(40) మార్గమధ్యంలో మృతి చెందింది. గాయపడ్డ వారిని గుడి యాత్తం, వేలూరు ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. వేలూరు కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ సెంథిల్‌కుమారి ఘటన స్థలాన్ని పరిశీలించి, విచారణ జరుపుతున్నారు.