అహ్మద్‌ పటేల్‌కు 44 ఓట్లు | 44 votes for Ahmed Patel | Sakshi
Sakshi News home page

అహ్మద్‌ పటేల్‌కు 44 ఓట్లు

Published Thu, Aug 10 2017 12:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

అహ్మద్‌ పటేల్‌కు 44 ఓట్లు - Sakshi

అహ్మద్‌ పటేల్‌కు 44 ఓట్లు

ఉత్కంఠభరిత పోరులో కాంగ్రెస్‌ నేత విజయం
- సునాయాసంగా గెలుపొందిన అమిత్‌ షా, స్మృతి ఇరానీ
బీజేపీకి ఓటేసిన 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వేటు
 
అహ్మదాబాద్‌/న్యూఢిల్లీ: ఆద్యంతం ఉత్కంఠభరితంగా, వివాదాస్పదంగా సాగిన గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అహ్మద్‌ పటేల్‌ ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థి బల్వంత్‌సిన్హ్‌ రాజ్‌పుత్‌పై విజయం సాధించారు. పటేల్‌కు 44 ఓట్లు, ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ్‌పుత్‌కు 38 ఓట్లు వచ్చాయి. మంగళవారం రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు జరిగిన పోలింగ్‌లో ఇద్దరు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు భోలాభాయ్‌ గోహిల్, రాఘవ్‌జీభాయ్‌ పటేల్‌ బ్యాలట్‌ పత్రాలను తమ పార్టీ ప్రతినిధికి కాకుండా బీజేపీ చీఫ్‌ అమిత్‌షాకు చూపారని కాంగ్రెస్‌ ఆరోపించడం, టీవీ ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల సంఘం వారి ఓట్లు చెల్లవని ప్రకటించడం తెలిసిందే. దీంతో ఒక అభ్యర్థి గెలవడానికి కావలసిన ఓట్ల సంఖ్య 45 నుంచి 44కు తగ్గింది.

గ్రెస్, బీజేపీ.. ఈసీని ఆశ్రయించిన అనంతరం అర్ధరాత్రి దాటాక కౌంటింగ్‌ నిర్వహించారు. బీజేపీ నుంచి రెండు స్థానాలకు పోటీ చేసిన ఆ పార్టీ చీఫ్‌ అమిత్‌ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెరో 46 ఓట్లు సాధించి సునాయాసంగా గెలుపొందారు. అమిత్‌ షా తొలిసారి రాజ్యసభలో ప్రవేశిస్తుండగా, ఇరానీ పెద్దల సభకు తిరిగి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీకి రాజకీయ సలహాదారైన పటేల్‌ ఐదోసారి రాజ్యసభలోకి అడుగుపెడుతున్నారు. పటేల్‌ విజయంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. 
 
తుదుపరి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలు: పటేల్‌ 
‘సత్యమే గెలుస్తుంది. ఇది నా విజయం మాత్రమే కాదు. అధికార దుర్వినియోగం, నిస్సిగ్గుగా వాడిన ధనబలం, కండబలాల ఉమ్మడి ఓటమి కూడా’ అని పటేల్‌ గెలుపు అనంతరం ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకత్వానికి, ఎమ్మెల్యేలకు, ఒకే కుటుంబంలా కలసి పనిచేసిన శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జేడీయూ ఎమ్మెల్యే చోటూ వాసవ తనకు ఓటేసినందుకు పటేల్‌ ఆ పార్టీ నేత శరద్‌ యాదవ్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. పటేల్‌ బుధవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గాంధీనగర్‌లోని తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. ‘ఈ ఎన్నికలు నా జీవితంలో అత్యంత కష్టమైనవి. నా విజయం పార్టీ కార్యకర్తల్లో అమిత ఉత్తేజం నింపింది. ఈ ఏడాదిలో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 125 సీట్లు సాధించడమే మా తదుపరి లక్ష్యం’ అని అన్నారు.

పెద్ద పోరాటంలో గెలిచినందుకు పటేల్‌ను అభినందిస్తున్నానని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. పటేల్‌ను శరద్‌ యాదవ్‌ కూడా అభినందించారు. కాగా, ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవన్న ఈసీ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తానని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ చెప్పారు. మరోపక్క.. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేసిన తమ 8 మంది గుజరాత్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ఆరేళ్లపాటు బహిష్కరించింది. వీరిలో శంకర్‌సిన్హ్‌ వాఘేలా, ఆయన తనయుడు మహేందర్‌ సిన్హ్, రాఘవ్‌జీ పటేల్, భోలాభాయ్‌ గోహిల్‌ తదితరులు ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఆరుగురిని కూడా బహిష్కరించాలని అధిష్టానానికి సిఫార్సు చేశానని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి అశోక్‌ గెహ్లాట్‌ తెలిపారు. ఈ ఆరుగురిలో ముగ్గురు బీజేపీలో చేరడం తెలిసిందే. 
 
అమిత్‌ షా, ఇరానీలకు మోదీ అభినందన
రాజ్యసభకు ఎన్నికైన అమిత్‌ షా, స్మృతి ఇరానీలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మూడేళ్లు పూర్తిచేసుకున్నందుకు కూడా షాను అభినందించారు. ఆయన సారథ్యంలో పార్టీ దేశంలో పలు ప్రాంతాలకు విస్తరించిందని కొనియాడారు. 
 
కాంగ్రెస్‌ సమస్యల పరిష్కర్త
సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న 67 ఏళ్ల అహ్మద్‌ పటేల్‌ గాంధీ–నెహ్రూ కుటుంబానికి నమ్మిన బంటు. కాంగ్రెస్‌లో సమస్యల పరిష్కర్తగా, వ్యూహనిపుణుడిగా పేరొందారు. పార్టీ బాధ్యతల్లో తలమునకలై ఉన్న ఆయన కాంగ్రెస్‌ హయాంలో ప్రభుత్వంలో చేరాలన్న వినతిని మృదువుగా తోసిపుచ్చారు. భరూచ్‌ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించిన పటేల్‌ స్వయంకృషితో రాజకీయాల్లో పైకెదిగారు. గుజరాత్‌ నుంచి ఏడు పర్యాయాలు(మూడుసార్లు లోక్‌సభకు, నాలుగుసార్లు రాజ్యసభకు) ప్రాతినిధ్యం వహించారు. 2004 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో యూపీఏ–1 ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలను కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement