కాంగ్రెస్‌లో ‘గుజరాత్‌’ టెన్షన్‌! | NCP to support Ahmed Patel in Gujarat Rajya Sabha elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ‘గుజరాత్‌’ టెన్షన్‌!

Published Tue, Aug 8 2017 12:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కాంగ్రెస్‌లో ‘గుజరాత్‌’ టెన్షన్‌! - Sakshi

కాంగ్రెస్‌లో ‘గుజరాత్‌’ టెన్షన్‌!

నేడు రాజ్యసభ ఎన్నికలు..
► అహ్మద్‌ పటేల్‌ గెలుపుపై ఉత్కంఠ
► చివరిక్షణంలో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎన్సీపీ.. బీజేపీకి మద్దతు
► విజయానికి ఒక్క ఓటు దూరంలో పటేల్‌..
► జేడీయూ, గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీపై కాంగ్రెస్‌ ఆశలు


అహ్మదాబాద్‌: గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. సోనియా రాజకీయ కార్యదర్శి, కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ను ఓడించి గట్టి షాక్‌ ఇవ్వాలని బీజేపీ, ఎలాగైనా గెలిచి దీటుగా సమాధానమివ్వాలని కాంగ్రెస్‌  సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గుజరాత్‌లో మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, బల్వంత్‌సిన్హ్‌ రాజ్‌పుత్‌లు, కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌లు బరిలో ఉన్నారు. పటేల్‌ విజయానికి 45 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా.. ప్రస్తుతం 44 మందే ఉన్నారు.

మిత్రపక్షం ఎన్సీపీకి చెందిన రెండు ఓట్లపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకోగా చివరి నిమిషంలో ఆ పార్టీ షాకిచ్చింది. బీజేపీకి ఓటేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేత ప్రఫుల్‌ పటేల్‌ సూచించారు. అయితే కాంగ్రెస్‌కు మద్దతిస్తామని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే చెప్పడం గమనార్హం. మారిన పరిస్థితితో కాంగ్రెస్‌ ఇప్పుడు జేడీయూ, గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. అలాగే కాంగ్రెస్‌ మాజీ నేత శంకర్‌సిన్హ్‌ వాఘేలా వర్గం ఎమ్మెల్యేలూ మద్దతిస్తారనే నమ్మకంతో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ చేయడంతో పాటు నోటా ఆప్షన్‌ను ఎంచుకుంటే పటేల్‌ ఓటమి ఖాయమని బీజేపీ అంచనా.

వాఘేలా తిరుగుబాటుతో తప్పిన లెక్కలు
కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తితో గత నెల్లో వాఘేలా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం తెలిసిందే. గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 176 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 121, కాంగ్రెస్‌కు 57 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌ బలం 51కి పడిపోయింది. వాఘేలా వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. దీంతో మిగిలిన 44 మంది ఎమ్మెల్యేల్ని రక్షించుకునేందుకు వారిని బెంగళూరు రిసార్టుకు తరలించారు.

వీరితో పాటు జేడీయూ, గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉండగా ఆ ఓట్లపైనే పటేల్‌ గెలుపు ఆధారపడింది. నిజానికి  పటేల్‌ నామినేషన్‌ సమయంలో ఎన్సీపీ, జేడీయూ ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉండడం గమనార్హం. వాఘేలా వర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేల్లో కొందరు తమకే ఓటేస్తారని కాంగ్రెస్‌ ఆశతో ఉంది. బీజేపీకి ఉన్న బలంతో రెండు స్థానాల్లో సులువుగా విజయం సాధిస్తుండగా.. మూడో అభ్యర్థికి ఆ పార్టీ వద్ద 31 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు.  విజయం సాధించాలంటే అభ్యర్థి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో నాలుగో వంతుతో పాటు అదనంగా ఒక ఓటు సాధించాలి.

నా గెలుపు ఖాయం: అహ్మద్‌ పటేల్‌
తన గెలుపుపై అహ్మద్‌ పటేల్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘44 ఓట్లు కాదు ఇంకా ఎక్కువే వస్తాయి.  గెలవడానికి కావాల్సిన∙బలం మాకుంది. మా ఎమ్మెల్యేలపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను’ అని చెప్పారు. ఎన్సీపీ, జేడీయూ ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతు ఇస్తారని పటేల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్‌ మాజీ నేత వాఘేలా మాత్రం తన వర్గం ఎమ్మెల్యేల మద్దతుపై దాటవేత ధోరణిలో మాట్లాడారు.

కాంగ్రెస్‌ నాయకత్వంతో తానసలు టచ్‌లో లేనని, బీజేపీకి మద్దతుపై చర్చల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ‘నేను ఎవరికి ఓటు వేస్తాననే విషయాన్ని చెప్పను. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు అనేది ఎమ్మెల్యేకి వ్యక్తిగత ఆస్తిలాంటిది’ అని చెప్పారు. 1977 నుంచి అహ్మద్‌ పటేల్‌ తాను మంచి స్నేహితులమని.. ఇప్పుడు కూడా ఆ బంధం అలాగే కొనసాగుతుందని, అది రాజకీయాలకు అతీతమని అన్నారు.  గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత ఓటింగ్‌ జరగడం ఇదే మొదటిసారి.

ఈగల్‌టన్‌ టు నిజానంద
కొద్ది రోజులుగా బెంగళూరులోని ఈగల్‌టన్‌ రిసార్టులో మకాం వేసిన 44 మంది గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సోమవారం తెల్లవారుజామున అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అనంతరం వారిని పొరుగునే ఉన్న ఆనంద్‌ జిల్లాలోని నిజానంద రిసార్ట్‌కు తరలించారు. రక్షాబంధన్‌ కోసం వారి  కుటుంబసభ్యులూ రిసార్ట్‌కు వచ్చారని, మంగళవారం  ఓటింగ్‌ కోసం ఎమ్మెల్యేల్ని గాంధీనగర్‌కు తీసుకెళ్తామని కాంగ్రెస్‌ ప్రతినిధి మనీశ్‌ దోషి చెప్పారు. కాగా రిసార్టు లోపల పోలీసు రక్షణను ఎమ్మెల్యేలు తిరస్కరించడంతో వెలుపల బలగాల్ని మోహరించారు. ఎమ్మెల్యేలకు రక్షణగా రిసార్టులో  కాంగ్రెస్‌ కార్యకర్తల్ని మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement