ఉలిక్కిపడ్డ కాంగ్రెస్.. ఇంత నీచమా అంటూ గగ్గోలు!
న్యూఢిల్లీ: గుజరాత్ ఎమ్మెల్యేలు బెంగళూరులో బస చేసిన రిసార్ట్‌పై, కర్ణాటక కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులతో ఉలిక్కిపడ్డ హస్తం అధినాయకత్వం.. ఇది బీజేపీ కుద్ర రాజకీయాలకు నిదర్శనమంటూ ఆక్రోశం వెళ్లగక్కింది. గుజరాత్‌లో రాజ్యసభ సీటు గెలిచేందుకే బీజేపీ ఇంతటి నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని విరుచుకుపడింది. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన బెంగళూరులోని ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్‌పై ఆదాయపన్నుశాఖ (ఐటీ) దాడులు నిర్వహించడంపై ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బీజేపీ నీచమైన ఎత్తుగడలతో కుట్ర పన్ని.. గుజరాత్‌లో రాజ్యసభ సీటు గెలువాలని భావిస్తోంది. మొదట ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వజూపింది. అది విఫలం కావడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన బీజేపీ సర్కారు ఇప్పుడు కాంగ్రెస్‌పై ఐటీ దాడులు జరుపుతోంది' అని కాంగ్రెస్ పార్టీ నేత రణ్‌దీప్ సూర్జేవాలా మండిపడ్డారు.
'ఒక్క రాజ్యసభ సీటు కోసం బీజేపీ అసాధారణమైనరీతిలో క్షుద్ర రాజకీయాలకు దిగుతోంది. మొదట ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంది. ఇప్పుడు ప్రతి సర్కారు ఏజెన్సీని వాడుకుంటోంది. ఐటీ దాడులు బీజేపీ నైరాశ్యాన్ని, నిస్పృహను చాటుతోంది' అని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అయిన అహ్మద్ పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అహ్మద్ పటేల్‌ను ఓడించడం ద్వారా కాంగ్రెస్‌ను గట్టిగా దెబ్బతీయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పారు. దీంతో మరింతమంది ఎమ్మెల్యేలు జారుకోకుండా ఉండేందుకు మొత్తం 44 మందిని బెంగళూరులోని రిసార్ట్‌కు తరలించింది. కర్ణాకటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు సురక్షితంగా ఉంటారని భావించింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక కాంగ్రెస్ నేతలపై, ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్‌పై ఐటీ దాడులు కాంగ్రెస్ పార్టీని షాక్‌కు గురిచేశాయి.