ట్విన్ సిస్టర్స్‌ను మింగేసిన కారు
గుర్‌గావ్: హృదయాన్ని కలచి వేసే దుర్ఘటన ఇది. ముద్దులొలికే కవల పిల్లలు బలైపోయారు. అప్పటిదాకా అమ్మమ్మ తాతాయ్యలతో వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన అక్కాచెల్లెళ్లు(5) కానరాని తీరాలకు చేరడం ఆ కుటుంబంలో అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. గుర్గావ్ లో బుధవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది.
మీరట్‌లో ఆర్మీ అధికారిగా పనిచేస్తున్న గోవింద్ కవల పిల్లలు హర్ష , హర్షిత వేసవి సెలవుల్లో పటౌడీ, జమల్ పూర్ గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడున్న చిన్నకుక్క పిల్లలతో ఆడుకోవడం అలవాటైంది. ఈ క్రమంలో సమీపంలో పార్క్ చేసిన ఉన్న కారులోకి ఎలా వెళ్లారో తెలియదుగానీ...అనుకోకుండా కార్ డోర్స లాక్ అయిపోయాయి. దాదాపు రెండు గంటలపాటు అలా కారులోనే ఉండిపోయారు.
ఇంతలో పిల్లలు కనిపించడకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెదుకులాట ప్రారంభించారు. చివరికి సాయంత్రం 6.15గం.లకు ఇంటిముందు పార్క్‌చేసినున్న కారు ముందు సీటులో ఒకరు, వెనుక సీటులో అపస్మారక స్థితిలో పడి వుండగా గమనించారు. దీంతో కారు తలుపులు పగుల గొట్టి చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగింది.
సుమారు 4.45 ని.లకు పిల్లలకు లెమన్ డ్రింక్ ఇచ్చినట్టు తాత కన్వర్ సింగ్ చెప్పారు. బుధవారం వీరు మీరట్ వెళ్లాల్సి ఉందనీ, ఇంతలోనే తమ బిడ్డలు ఇక ఎప్పటికీ లేకుండా పోయారంటూ కన్నీటి పర‍్యంతమయ్యారు. అయితే గోవింద్ కజిన్‌కు చెందిన ఈ కారు గత కొన్ని నెలలుగా వాడడంలేదని తెలుస్తోంది. కారు తలుపులు, విండోస్ లాక్ అవడం వల్లనే పాపలు చనిపోయినట్టు బిలాస్పూర్ పోలీస్ స్టేషన్ ఎఎస్ఐ మహేష్ కుమార్ ధృవీకరించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు చెప్పారు.