అందుబాటులోకి 550 మెడిసిన్ సీట్లు | 550 Medicine seats are coming to Telangana, AP | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి 550 మెడిసిన్ సీట్లు

Published Fri, Sep 19 2014 2:48 AM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM

అందుబాటులోకి 550 మెడిసిన్ సీట్లు - Sakshi

అందుబాటులోకి 550 మెడిసిన్ సీట్లు

* దేశవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న అన్ని వైద్య కళాశాలలకూ అనుమతి
* ఈ నెల 30లోగా ఈ సీట్లకు కౌన్సెలింగ్
* రూ. 10 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి..
* పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని నెలాఖరులోగా హామీపత్రం సమర్పించాలి
* లోపాలను సవరించుకోకుంటే పూచీకత్తు జప్తు, కఠిన చర్యలు
* ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు హెచ్చరిక

 
సాక్షి, న్యూఢిల్లీ: లోపాలున్నాయంటూ ఎంసీఐ మెడిసిన్ సీట్ల రెన్యువల్‌ను నిలిపివేసిన ప్రైవేటు వైద్యవిద్యా కళాశాలలకు ఊరట లభించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఆయా కళాశాలల్లో సీట్ల రెన్యువల్‌కు అనుమతిస్తూ సుప్రీం కోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వాలని, దీనితోపాటు రూ.10 కోట్ల బ్యాంకు గ్యారంటీతో పూచీ కత్తును నెలాఖరు కల్లా సమర్పించాలని కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. ఆ సీట్ల కోసం సెప్టెంబర్ 30లోపు కౌన్సెలింగ్ పూర్తి చేయాలని పేర్కొంది.  నిబంధనలను సంతృప్తిపరచకపోతే పూచీకత్తును జప్తు చేయడంతోపాటు తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.
 
ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో దాదాపు 550 మెడిసిన్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి భారత వైద్య మండలి(ఎంసీఐ) దేశవ్యాప్తంగా దాదాపు 90 వైద్య కళాశాలలకు సంబంధించి మెడిసిన్ సీట్ల రెన్యువల్, కొత్త కళాశాలలు, అదనపు సీట్ల మంజూరుకు అనుమతి నిరాకరించింది. దీంతో ఈ అంశాలపై పలు ప్రైవేటు వైద్య కళాశాలలు సుప్రీ్ంటను ఆశ్రయిం చాయి. ఈ మేరకు దాఖలైన 27 పిటిషన్లపై జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ విక్రమ్‌జిత్‌సేన్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌తో కూడిన ధర్మాసనం.. గురువారం విచారణ కొనసాగించింది.
 
ఎంసీఐది నిర్లక్ష్యం..
వైద్య కళాశాలలకు సీట్లు మంజూరు చేసే విషయంలో ఎంసీఐ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని ప్రైవేటు వైద్య కళాశాలల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.
 
హామీ ఇచ్చారు.. అయినా లోపాలే!
ఎంసీఐ తరఫున న్యాయవాది వికాస్‌సింగ్ వాదనలు వినిపిస్తూ ‘‘ఇటీవల కొన్ని కళాశాలలను తనిఖీచేస్తే అక్కడ ఒక్క ప్రొఫెసరూ లేరు.  అసో సియేట్ కూడా లేరు. పడకల ఆక్యుపెన్సీ రేటు సున్నా శాతం. అన్ని వసతులు సమకూర్చుకుని విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సిందిపోయి వారి నుంచి ఫీజులు వసూలు చేసి ఆ తరువాతే వాటిని సమకూర్చుతామంటే ఎలా?. ఏటా ఇదే తంతుగా మారితే వైద్య విద్య బోధనా ప్రమాణాలు పడిపోతాయి’’ అని తెలిపారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ వివరణ ఇస్తూ సీట్లకు అనుమతిపై అభ్యంతరం లేదన్నారు.
 
ఇది విద్యార్థుల అంశం..

కళాశాలలు, ఎంసీఐ వాదనలు విన్న అనంతరం జస్టిస్ అనిల్ ఆర్ దవే మాట్లాడుతూ ‘‘రెన్యువల్ సీట్లు అంటే గతేడాది, అంతకుముందు ఏడాది అనుమతి పొందినవనే కదా! వాటి వరకు అనుమతిస్తే తప్పేమిటి?’’ అని ఎంసీఐని ప్రశ్నించా రు. దీనికి ఎంసీఐ న్యాయవాది వివరణ ఇస్తూ.. ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిందేనన్నారు. దవే మాట్లాడుతూ ‘‘ఎంసీఐ వాదనను మేం కాదనడం లేదు. ఇది విద్యార్థుల అంశం. తీవ్రంగా బాధించే అంశం. కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఇప్పుడు సీట్లకు అనుమతిస్తే ఇదివరకే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఉదాహర ణకు 70 సీట్లుంటే 72వ ర్యాంకు అభ్యర్థికి బీడీ ఎస్ సీటు దక్కింది. ఇప్పుడు కౌన్సెలింగ్ నిర్వహిస్తే 75వ ర్యాంకు అభ్యర్థి ఎంబీబీఎస్ సీటు పొందుతాడు. మరి 72వ ర్యాంకు అభ్యర్థి నష్టపోయినట్లే కదా!’ అని విచారం వ్యక్తంచేశారు.
 
యాజమాన్యాలు హామీ ఇవ్వాలి..
దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యా కళాశాలల్లో రెన్యూవల్‌ను నిలిపివేసిన సీట్లకు షరతులతో కూడిన అనుమతిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఆయా కాలేజీల యాజమాన్యాలు రూ.10 కోట్ల బ్యాం కు గ్యారంటీతో పూచీకత్తును సమర్పించాలని.. పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని హామీపత్రం ఇ వ్వాలని ఆదేశించింది. ఇది కేవలం గత ఏడాది వరకు అందుబాటులో ఉండి ఇప్పుడు రెన్యువల్ కోరిన సీట్లకు మాత్రమే వర్తిస్తుందని, కొత్త కళాశాలలకు వర్తించదని స్పష్టం చేసింది. ‘‘ఈ సీట్లకు విడిగా కౌన్సెలింగ్ నిర్వహించాలి. కేం ద్రం ఈ తాజా ఉత్తర్వులపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్యార్థుల్లో తగిన ప్రచారం కల్పించాలి. కేసులో తుది విచారణ డిసెంబర్‌లో చేపడతాం’’ అని ధర్మాసనం పేర్కొంది. ఉత్త ర్వులతో దేశవ్యాప్తంగా 46 కళాశాలల్లో దాదాపు 6 వేల మెడికల్ సీట్లు రెన్యువల్ కానున్నాయి.
 
ఏపీ, తెలంగాణలోని ఐదు కాలేజీల్లో..
మెడిసిన్ సీట్ల రెన్యూవల్, కొత్త కళాశాలలు, అదనపు సీట్లు పెంచడం వంటి కేటగిరీల్లో కోర్టును ఆశ్రయించిన కళాశాలల్లో ఏపీ, టీఎస్ నుంచి దాదాపు 13 కాలేజీలున్నాయి. ఈ ఏడాది దాదా పు 1,250 సీట్లకు ఎంసీఐ కోత విధించింది. రెన్యూవల్ సీట్లకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు రెండు రాష్ట్రాలకు చెందిన ఐదు మెడికల్ కళాశాలల్లో దాదాపు 550 సీట్లు రెన్యువల్ కానున్నట్టు సమాచారం. ఫాతి మా వైద్య కళాశాలలో 100 సీట్లు, జెమ్స్ కళాశాలలో 100, వీఆర్‌కే మహిళా కళాశాలలో 100, మల్లారెడ్డి వైద్య కళాశాలలో 150, గుంటూరు కాటూరి కళాశాలలో 50, మెడిసిటీ కళాశాలలో 50 సీట్లు రెన్యువల్ కానున్నట్టు తెలుస్తోంది.
 
ఆదేశాలు అందాకే నిర్ణయం: వీసీ
విజయవాడ: ఏపీ, తెలంగాణలో ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో సీట్లను పునరుద్ధరించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు కాపీ అందాకే నిర్ణయం తీసుకుంటామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ టి.రవిరాజు తెలిపారు. సాధారణంగా అయితే రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కోసం మొదటి విడతలో ఎంబీబీఎస్/బీడీఎస్ సీట్లు పొందిన అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చన్నారు. అయితే సుప్రీం ఈ విషయంలో ఏవిధంగా  తీర్పు ఇచ్చిందో వర్సిటీకి అధికారికంగా సమాచారం లేదని... శనివారం సాయంత్రం  తీర్పు కాపీ అందే అవకాశం ఉందని తెలిపారు. దాన్ని బట్టీ కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement