చెన్నై : తమిళనాడులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సేలం జిల్లా రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. న్యాయమూర్తి ప్రకాష్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో దిండుగల్లుకు వెళుతున్నారు. కరూరు జిల్లా అరవాక్కురిచ్చి సమీపంలోని పుంగంపాడి చీలిక రోడ్డులో గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వెళుతుండగా కారు ముందువైపు టైరు పంక్చర్ అయింది. అదుపుతప్పిన కారు డివైడర్ను గుద్దుకుని అవతలి రోడ్డులోకి దూసుకెళ్లి దిండుగల్లు నుంచి వస్తున్న మరో కారును ఢీకొంది.
ఈ ఘటనలో ఒక మహిళ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాల పాలైన సేలం న్యాయమూర్తి ప్రకాష్, మరో కారులో ప్రయాణిస్తున్న వల్లి (38), సూర్య (10), శాంతి (25)లను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన రాణి (48), రాజమ్మాళ్ (48), రాజలింగం (20), మరో ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.