రామేశ్వరం పోలీసు స్టేషన్‌లో ప్రేమజంట మగత్, జయకృష్ణన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమకు కళ్లు లేవు గుడ్డిది అంటారు.. అయితే కళ్లు మాత్రమే కాదు వయసు కూడా లేదనేలా రెండు జంటలు వ్యవహరించాయి. పంజాబ్, కేరళ రాష్ట్రాలకు చెందిన రెండు ప్రేమజంటలు తమిళనాడులోనే తలదాచుకోవడం, వరుసగా రెండు సంఘటనలు చోటుచేసుకోవడం కాకతాళీయమైనా విచిత్రమే. అంతేగాక రెండు సంఘటనల్లోనూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన అయ్యవార్లే విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించడం శోచనీయం.
40 ఏళ్ల టీచర్, 15 ఏళ్ల విద్యార్థితో పరార్
ఆమె టీచర్, అతడు పదోతరగతి విద్యార్థి. పవిత్రమైన గురుశిష్య సంబంధాన్ని అపవిత్రంగా మార్చివేసి ప్రేమ మోజులో పారిపోయి తమిళనాడులో తలదాచుకుని ఉన్నారు.
కేరళ రాష్ట్రం ఆలప్పుళా సమీపం సేర్తళాముగమ్మా అనే ప్రాంతంలోని ప్రయివేటు ఇంగ్లిషు మీడియం పాఠశాలలో 300 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. పదోతరగతి విద్యార్థి, అదే పాఠశాలలోని 40 ఏళ్ల ఉపాధ్యాయురాలు సన్నిహితంగా మెలగసాగారు. పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని చెరిపివేశారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమెకు పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న ఆమెకు విద్యార్థి మాటలు ఎంతో ఆనందాన్ని ఇవ్వడంతో ఇటీవల ఖరీదైన సెల్‌ఫోన్ కూడా కొనివ్వగా ఇళ్లకు వెళ్లిన తరువాత కూడా ఇరువురూ ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఈనెల 23 వ తేదీన విద్యార్థి అకస్మాత్తుగా ఇంటి నుంచి పారిపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ విచారణలో సదరు ఉపాధ్యాయిని సైతం కనపడక పోవడంతో ఇద్దరూ కలిసి పారిపోయినట్లు నిర్ధారించుకున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలోని వర్కలాలో ఉన్నట్లు పోలీసులు వెళ్లగా ఈలోగా వారు తప్పించుకున్నారు. ఇంకా వారికోసం గాలిస్తున్న తరుణంలో తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో ఉన్నట్లు బుధవారం సమాచారం అందింది. కేరళ పోలీసులు హుటాహుటిన గురువారం కన్యాకుమారికి చేరుకోగా అప్పటికేవారు జారుకున్నారు. కన్యాకుమారి నుంచి మదురై, ఊటీ, కొడైక్కెనాల్ పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చని అంచనావేసి గాలింపు ముమ్మరం చేశారు.
‘మాది వాంఛలు లేని పవిత్ర ప్రేమ’
పంజాబ్ రాష్ట్రం నుంచి పారిపోయి రామేశ్వరంలో పోలీసులకు బుధవారం పట్టుబడిన చిత్రమైన ప్రేమజంట ‘తమది కామవాంఛలు లేని పవిత్ర ప్రేమ’ అని పోలీసులు, పెద్దలతో వాదించిన విషయం గురువారం బయటపడింది. వివరాల్లోకి వెళ్లితే.. పంజాబ్ రాష్ట్రంలోని అపోకర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన జయ్‌కృష్ణన్ (65) తన వద్ద ట్యూషన్ వచ్చే మగత్ (20) అనే విద్యార్థినిపై మమకారం పెంచుకున్నాడు. భార్య చనిపోగా, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెను కలిగి ఉన్న జయ్‌కృష్ణన్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన కాలంలో మగత్‌ను ఆకర్షించే ప్రయత్నాలు చేశాడు. రిటైరైన తరువాత కూడా మగత్‌కు ఆర్థిక సహకారం చేయడం, ఇంటికి పిలిపించుకుని మరీ ట్యూషన్లు చెప్పడం, ఇద్దరూ కలిసి భోంచేయడం పరిపాటిగా తయారై ప్రేమగా మారింది.
ఈనెల 11వ తేదీన జయకృష్ణన్ రూ.25వేల తన పింఛన్ సొమ్ముతోపాటు ఇంటిలోని నగదును తీసుకురాగా ఇద్దరూ ఇళ్లు వదిలి పారిపోయారు. అనేక ప్రాంతాలు తిరుగుతూ రెండురోజుల క్రితం తమిళనాడులోని రామేశ్వరానికి చేరుకున్నారు. తండ్రి, కుమార్తెలమని చెప్పి ప్రయివేటు అతిథిగృహంలో రూము తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పంజాబ్, రామేశ్వరం పోలీసులకు బుధవారం వారు పట్టుబడ్డారు. ఇద్దరి మధ్య చనువు పెరిగిపోవడంతో ఏడాది క్రితమే వారిద్దరూ పెళ్లి చేసుకుని రహస్య కాపురం సాగిస్తున్న విషయం బయటపడింది. ఎన్నాళ్లీ దొంగకాపురం, స్వేచ్ఛగా కలిసి జీవిద్దామనే ఆలోచనతోనే పంజాబ్ నుంచి పారిపోయి పోలీసులకు పట్టుబడ్డారు.
‘మాది పవిత్ర ప్రేమ’ :జయకృష్ణన్, మగత్
మాది పవిత్రమైన ప్రేమ.. తప్పుపట్టే పని మేం చేయలేదని వారిద్దరూ పోలీసుల వద్ద సమర్థించుకున్నారు. ‘‘శారీరక సుఖం కోసం మగత్‌ను పెళ్లి చేసుకోలేదు, భార్యను కోల్పోయిన దుఃఖంలో ఉన్న నాపై మగత్ అత్యంత అభిమానం చూపించింది. ఇదే మాఇద్దరి మధ్య ప్రేమకు కారణం’’ అని జయకృష్ణన్ చెప్పాడు. ‘‘చిన్నవయసు నుంచే నా పట్ల చూపిన ఆదరణే జయకృష్ణన్ అంటే విలువపెంచేలా చేసిందని మగత్ తెలిపింది. కాలక్రమేణా నాకు తెలియకుండానే ఆయనంటే ప్రేమ ఏర్పడింది. నా ప్రేమ తప్పని తెలిసినా ఆయనతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. బతికితే అతనితోనే బతుకుతాను, భర్తను నా నుంచి విడదీయవద్దు’’అని పోలీసుల వద్ద మగత్ పెద్దగా విలపించింది. పంజాబ్‌కు వెళ్లడం ఇష్టం లేదని, అక్కడికి వెళితే తమని చంపేస్తారని, తాను మేజర్‌ను కావడం వల్ల ఎవరితోనైనా జీవించే హక్కు తనకుందని మగత్ పోలీసుల వద్ద వాదించింది. అయితే వారిద్దరినీ పంజాబ్ పోలీసులకు అప్పగించాలని రామేశ్వరం కోర్టు తీర్పు చెప్పడంతో విధిలేక తిరుగు ప్రయాణమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment