
తిరువణ్ణామలై (తమిళనాడు): పాఠశాల విద్యార్థినిని జిల్లా కలెక్టర్ తన కుర్చీలో కూర్చోబెట్టి అభినందించిన సంఘటన తమిళనాడులోని తిరువణ్ణామలైలో శనివారం జరిగింది. తిరువణ్ణామలై కలెక్టర్‌గా కందస్వామి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఆయన పనితీరుకు ఆకర్షితురాలైన వేంగికాల్ పొన్నుస్వామి నగర్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని పూజ తనకు కలెక్టర్‌ను నేరుగా కలిసి మాట్లాడడంతో పాటు అభినందించాలని ఉందని లేఖ రాసింది.
దీంతో కలెక్టర్ కందస్వామి విద్యార్థినిని కలిసేందుకు శనివారం మధ్యాహ్నం సమయం కేటాయించారు. పూజ తన తల్లితో పాటు కలెక్టర్ చాంబర్‌లోనికి వెళ్లి ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న పూజ కింది తరగతుల విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్నట్లు, సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలుసుకున్న కలెక్టర్ ఆమెను ప్రశంసించారు. దేశంలో విద్యార్థులు అతిపెద్ద శక్తి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చెప్పిన మాటలను విద్యార్థి కలెక్టర్‌కు చెప్పడంతో ఆయన తన సీటులో విద్యార్థినిని కూర్చోబెట్టి అభినందించారు.