కేరళలోని వటకర ప్రాంతంలో నివసించే మీనాక్షమ్మ(76) అనే మహిళ కళరియ పట్టు విద్యతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ఆన్ లైన్ లో కళరియ పట్టు చూపిస్తున్న వీడియో వైరల్ అయింది. ప్రాచీన భారతదేశపు కళల్లో ఒకటైన కళరియ పట్టును మీనాక్షమ్మ విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటుంది. కళరియ పట్టు విద్యలో కర్రలు, షీల్డ్ లు, కత్తులు, డాగర్లను ఉపయోగించి ప్రత్యర్థులపై పోరాడుతారు.
ఫేస్ బుక్ లో ఇండియా అరైజింగ్ పేరుతో జూన్ 16న పోస్ట్ చేసిన వీడియోను ఇప్పటివరకు తొమ్మిది లక్షల మంది వీక్షించారు. వీడియోలో మీనాక్షమ్మ తన శిష్యుడు వయసులో చిన్నవాడైన వ్యక్తి తో పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. చీర కొంగును గట్టిగా లాగి కట్టిన మీనాక్షమ్మ క్షణాల్లో అతనిపై పైచేయి సాధించి కళరియ విద్యలో తనకు ఉన్న నేర్పరితనాన్ని చూపించారు. కేరళ రాష్ట్రంలోనే పుట్టిన కళరియ పట్టు విద్య ప్రపంచంలో అతికష్ట మైన విద్యల్లో ఒకటిగా పేరుగాంచింది.